ఫ్రాన్స్ లోని నీస్ నగరంలో ప్రజలు నిన్న రాత్రి రోడ్లమీదకి వచ్చి సామోహికంగా బాస్తిల్ పండుగ సంబరాలు జరుపుకొంటున్న సమయంలో ఒక బారీ ట్రక్ అతివేగంగా వారిపై నుంచి దూసుకుపోవడంతో అక్కడికక్కడే సుమారు 80 మంది మరణించగా మరో 100మందికి పైగా గాయపడ్డారు. ఆ వాహనంలో ఉన్న కొంతమంది ప్రజలపై, పోలీసులపై కాల్పులు జరుపడంతో అది రోడ్లపై సాధారణంగా జరిగే వాహన ప్రమాదం కాదని స్పష్టమయింది. ఆ ట్రక్కులో తుపాకులు, ప్రేలుడు సామాగ్రి కూడా దొరకడంతో అది ఖచ్చితంగా ఉగ్రవాదుల పనే అయ్యుంటుందని ఫ్రాన్స్ పోలీసులు అనుమానిస్తున్నారు. వారి అనుమానాలు నిజమని నిరూపిస్తున్నట్లుగా ఆ వినూత్నమైన దాడి తాలూకు వీడియో క్లిప్పింగులు ఐసిస్ ఉగ్రవాద సంస్థ, దాని అనుబంధ వెబ్ సైట్లలో పెట్టబడ్డాయి. అంటే ఐసిస్ ఉగ్రవాదులో లేదా మరొక ఉగ్రవాద సంస్థో ఈ సరికొత్త విధానంలో దాడికి కుట్రపన్నినట్లు అర్ధమవుతోంది.
నగరాలలో బాంబులతో విద్వంసానికి పాల్పడటం, ఆత్మాహుతి దాడులకి పాల్పడటం కంటే ఈ పద్దతిలో అయితే చాలా సులువుగా ఎక్కువ విద్వంసం, ప్రజలలో, ప్రభుత్వాలలో భయోత్పాతం సృష్టించవచ్చనే ఉద్దేశ్యంతోనే ఉగ్రవాదులు ఈ సులువైన పద్దతిని ఎంచుకొన్నట్లు స్పష్టం అవుతోంది. అత్యంత పటిష్టమైన నిఘా వ్యవస్థ, అత్యాధునికమైన సాంకేతిక పరిజ్ఞానం, అపారమైన అర్దిక వనరులు కలిగిన ఫ్రాన్స్ వంటి అభివృద్ధి చెందిన దేశంలోనే ఇంత దారుణంగా ఉగ్రవాదులు దాడులకి తెగబడగలిగితే, మన దేశం పరిస్థితి ఏమిటని ఆలోచిస్తే చాలా భయం వేస్తుంది.
హైదరాబాద్ పాతబస్తీలో కొందరు ఐసిస్ ఉగ్రవాదులని ఎన్.ఐ.ఏ. అధికారులు అరెస్ట్ చేస్తే, వారికి న్యాయసహాయం చేస్తామని మజ్లీస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ నిర్భయంగా ప్రకటించారు. కాశ్మీరులో కరడుగట్టిన హిజ్బుల్ ముజాహుద్దీన్ ఉగ్రవాది బుర్హాన్ వనీని భద్రతాదళాలు హతమారిస్తే, అందుకు నిరసనగా గత వారం రోజులుగా కాశ్మీర్ ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. ఆందోళనకారులకి, భద్రతాదళాలకి మధ్య జరుగుతున్న ఘర్షణలలో ఇంతవరకు 36మంది చనిపోగా సుమారు 1500 మందికిపైగా గాయపడ్డారు. వారి ఆందోళనలు కాశ్మీరులో వేర్పాటువాదం ఎంతగా విస్తరించిపోయిందో కళ్ళకి కట్టినట్లు చూపిస్తున్నాయి. నేటికీ ఇంకా ఘర్షణలు కొనసాగుతూనే ఉండటంతో వాటిని అరికట్టడంలో పూర్తిగా విఫలమైన జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీ కాశ్మీరులో శాంతి నెలకొల్పడానికి సహకరించమని వేర్పాటువాదులని ప్రాధేయపడవలసిరావడం చూస్తే మన దేశంలో ఉగ్రవాదులకి, వేర్పాటువాదులకి ఎంత పట్టు ఉందో, వారే ప్రభుత్వాలని ఏవిధంగా శాసించగలుగుతున్నారో అర్ధమవుతోంది.
ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేసే అగ్రరాజ్యాలలోనే ఇంత భయానకమైన దాడులు జరుగుతుంటే, ఇక ఇటువంటి నేపధ్యం ఉన్న భారత్ పరిస్థితి ఏమిటని ఆలోచిస్తే చాలా భయమేస్తుంది. ఒకవేళ భారత్ లో కూడా ఉగ్రవాదులు ఇదే పద్దతిలో దాడులకి పాల్పడితే వారిని మన పోలీస్, రవాణా, నిఘా, భద్రతా వ్యవస్థలు అడ్డుకోగలవా? ఫ్రాన్స్ లో ఈ దాడిని కేవలం ఒక వార్తగా మాత్రమే చూడకుండా దాని నుంచి అందరూ పాఠాలు నేర్చుకొని అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం.