పావురాలు అంటే ప్రేమకు చిహ్నాలుగా చెబుతారు! ఎందుకంటే, ఒకప్పుడు ప్రేమికుల మధ్య ఇవే రాయబారులు. ప్రేమలేఖల్ని మోసుకెళ్తూ ఉండేది. వాట్సాప్లూ ఫేస్‌బుక్కులూ లేని రోజుల్లో ఇవే మెసెంజర్లు. రాజ్యాల మధ్య పావురాలే పోస్ట్‌మెన్ డ్యూటీ చేసేవి. అయితే, ఈ రోజుల్లో కూడా పావురాలు ఇంకా డ్యూటీ చేస్తున్నాయి. ఇలా చెప్పే కంటే… ఇంకా కొంతమంది పావురాలపైన ఆధారపడుతున్నారు. అదేంటండీ… సెల్ఫోన్లు ఉన్నాయి కదా, ఇంటర్నెట్ ఉంది కాదా, మరీ ఛాదస్తం కాకపోతే.. ఇంకా పావురాలతో రాయబారాలేంటండీ అనుకుంటే తప్పులో కాలేసినట్టే! ఎందుకంటే, టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మనిషికి ప్రైవసీ ఎక్కడుంది చెప్పండీ..? చేతిలో సెల్‌ఫోన్ ఉందంటే చాలు… ఆ మనిషి ఎక్కడున్నాడో ఇట్టే ట్రాక్ చెసెయ్యొచ్చు! సోషల్ మీడియాలో రహస్య సందేశాలు పంపుకున్నా ఇంతే… ఈజీగా ట్రాక్ అయిపోతాయి. ఫోన్లలో రహస్యంగా మాట్లాడుకోవడం సాధ్యమా..? ఒక బిగ్ బాస్ నిఘా మనపై ఉంటూనే ఉంటుంది కదా. అదే పావురాల ద్వారా సమాచారాన్ని పంపుకున్నాం అనుకోండీ.. ఎంత సేఫ్. ఉగ్రవాదులకు ఇంతకంటే ప్రైవసీ డివైజ్ ఎక్కడ దొరుకుతుంది చెప్పండీ!
అందుకే కదా, ఈ మధ్య పాకిస్థాన్ కూడా మనదేశ సరిహద్దుల్లో రహస్యాల కోసం పావురాలను పంపింది! పక్షుల రెక్కల్లో చిప్స్ పెట్టీ, కెమెరాలు పెట్టి.. సరిహద్దు దాటి రహస్య సమాచారాలను మోసుకెళ్తున్న పక్షుల్ని పోలీసులు గుర్తిస్తూనే ఉన్నారు. తాజాగా ఇలాంటివే ఓ 150 పావురాలను కశ్మీరు పోలీసులు పట్టుకున్నారు. ఓ ముగ్గురు వ్యక్తులు ఈ పావురాలను అరటిపండ్లు తరలించే పెట్టెల్లో రహస్యా రవాణా చేస్తుండటంతో పోలీసులకు అనుమానం వచ్చింది. వారిని అదుపులోకి తీసుకుని పావురాలను టెస్టింగ్‌కి పంపారట! ఆ టెస్టుల్లో తేలింది ఏంటంటే… ఈ పావురాలన్నీ వెల్ ట్రెయిన్డ్ అని! వాటి కాళ్లకు మాగ్నటిక్ చిప్స్ కూడా ఉన్నాయట. అంటే, గూఢచర్యం కోసం ఈ పావురాలను వినియోగిస్తారని స్పష్టమైంది.
దాంతో వాటిని గుట్టుచప్పుడు కాకుండా అట్టపెట్టెల్లో తీసుకెళ్తున్న ఆ ముగ్గుర్నీ పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఈ పావురాలను ఎవరి కోసం తీసుకెళ్తున్నారు..? ఎక్కడ శిక్షణ ఇచ్చారు అనే అంశాలపై ఆరా తీస్తున్నారు. అంటే, ఉగ్రవాద సంస్థల రహస్య ట్రెయినింగ్ క్యాంపుల మాదిరిగానే పావురాలకు కూడా గూఢచర్యం నేర్పిస్తున్నవారు ఉన్నారన్నమాట! సో… పావురాలన్నీ ప్రేమ పావురాలు కావనేది బాటమ్ లైన్!