అమెరికా కార్ల దిగ్గజం టెస్లా ఇండియాలో ప్లాంట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. మూడు బిలియన్ డాలర్లు పెట్టుబడిగా పెట్టనుంది. ఇందు కోసం స్థలం ఖరారు కోసం ఓ బృందం ఇండియాకు రాబోతోంది. ప్రాథమికంగా టెస్లా పరిశీలనలో గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలను అసలు పట్టించుకోలేదు. అన్నింటి కంటే ముఖ్యంగా ఆటోమోబైల్ పరిశ్రమకు అనుకూలంగా.. పోర్టుల సౌకర్యం ఎక్కువగా ఉన్న ఏపీ గురించి అసలు పరిగణనలోకి తీసుకోలేదు.
గతంలో టెస్లా దిగుమతి చేసుకుని కార్లను అమ్మాలనుకుంది అయితే ట్యాక్స్‌లు తగ్గించేందుకు కేంద్రం అంగీకరించలేదు. మేడిన్ ఇండియా కార్లకు మాత్రమే ట్యాక్స్ మినహాయింపులని స్పష్టం చేయడంతో.. చివరికి ప్లాంట్ పెట్టాలని నిర్ణయించుకుంది. ఇండియాలో పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థ కారణంగా కార్లకు డిమాండ్ పెరుగుతోంది. అలాగే చుట్టుపక్కల దేశాలకు ఎగుమతి అవకాశాలు, చైనాలో టెస్లా ప్లాంట్‌కు ఎదురవుతున్న సవాళ్లు అన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఇండియాలో ప్లాంట్ పెట్టాలనుకున్నారు.
గతంలో సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబునాయుడు అమెరికా పర్యటనలో టెస్లా యజమాని ఎలన్ మస్క్ తో సమావేశం అయ్యారు. ఏపీ పర్యటనకు ఆహ్వానించారు. ఆ తర్వాత ఏపీ నుంచి ఎలాంటి ఫాలో అప్ లేదు. ప్లాంట్ పెట్టాలనుకున్న తర్వాత టెస్లాకు ఎలాంటి ప్రతిపాదనలు పంపలేదు. ఇటీవల వైసీపీ ప్రభుత్వం నిర్వహిచిన పెట్టుబడుల సదస్సులో టెస్లా వ్యవస్థాపకుడు పాల్గొన్నారని వైసీపీ సోషల్ మీడియా హడావుడి చేసింది. అయితే ఆయనను ఎప్పుడో జమానా కిందటే ఎలన్ మస్క్ బ యటకు గెంటేశాడని తర్వాత తెలిసింది. అలాంటి వారిని టెస్లా ప్రతినిధిగా ప్రచారం చేసిన ఏపీ ప్రభుత్వం పట్ల మస్క్ ఏ మాత్రం ఆసక్తి చూపించే అవకాశం లేదన్న అభిప్రాయం వినిపిస్తోంది.
నిజానికి కియా ఏర్పాటు తర్వాత ..ప్రపంచ ఆటోమోబైల్ ఇండస్ట్రీలో ఏపీకి ప్రత్యేక స్థానం వచ్చింది. అతి పెద్ద ప్లాంట్ ను అత్యంత వేగంగా నిర్మించడం, ప్రభుత్వ సహకారం అన్నీ హైలెట్ అయ్యాయి. కానీ ఇప్పుడు గత ఐదేళ్లలో ప్రభుత్వం తీరుతో.. అసలు పెట్టుబడుల రాడార్లోనే ఏపీ లేకుండా పోయింది.