ఆర్.మాధవన్, సిద్ధార్థ్, నయనతార.. ఈ ముగ్గురు కలసి ఓ సినిమా చేశారు. అదే ‘టెస్ట్’. ‘ఫర్జీ’, ‘గన్స్ అండ్ రోజెస్’, ‘ఫ్యామిలీ మ్యాన్’, రఘుతాత చిత్రాలకు రచయితగా పని చేసిన సుమన్ కుమార్ ఈ మూవీకి కథ అందించారు. నిర్మాత ఎస్. శశికాంత్ ఈ సినిమాతో దర్శకుడిగా మారాడు. హ్యూమన్ డ్రామాగా ఈ సినిమా ఈరోజు నేరుగా నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయ్యింది. ముగ్గురు జీవితాలని ఓ టెస్ట్ క్రికెట్ మ్యాచ్ కి ముడిపెట్టి తీసిన ఈ సినిమా ప్రేక్షకుడికి ఎలాంటి ఫీలింగ్ కలిగించింది ? మాధవన్, సిద్ధార్థ్, నయనతార లాంటి స్టార్స్ ఎంపిక చేసుకోదగ్గ కథ ఏముంది?
కుముద (నయనతార)ఒక స్కూల్ టీచర్. కుముద భర్త శరవణన్ (ఆర్ మాధవన్) ఓ సైంటిస్ట్. నీళ్ళ నుంచి పెట్రోల్ తయారు చేయడం అతడి డ్రీం ప్రాజెక్ట్. దాని కోసం చాలా కష్టపడుతుంటాడు. వీళ్ళకి పిల్లలు కలగరు. కుముద కుత్రిమ మార్గంలో గర్భం దాల్చాలని ప్రయత్నిస్తుంటుంది. అర్జున్ (సిద్ధార్థ్) ఇండియా క్రికెట్ జట్టులో స్టార్ ఆటగాడు. క్రికెట్ అంటే అతనికి ప్రాణం. కానీ ఫామ్ లో లేకపోవడంతో అతన్ని జట్టు నుంచి తొలగించాలని బోర్డ్ బావిస్తుంది. అయితే ఎదోరకంగా మళ్ళీ జట్టులోకి వస్తాడు. ఇండియా పాకిస్తాన్ టెస్ట్ మ్యాచ్ చెన్నైలో జరుగుతుంది. సరిగ్గా ఇదే సమయంలో బెట్టింగ్ సిండికేట్ ఈ ముగ్గురి జీవితంలోకి వస్తుంది. జీవితంలో ఏమీ సాధించలేక అసమర్థుడిగా వున్న శరవణన్, అర్జున్ కొడుకుని కిడ్నాప్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తాడు. తర్వాత ఏం జరిగింది? శరవణన్ ఆడమన్నట్లు అర్జున్ ఆడాడా? జీవితంలో ఎన్నో కలలు వున్న శరవణన్ అసలు కిడ్నాప్ ఎందుకు చేయాల్సి వచ్చింది? ఇదంతా మిగతా కథ.
ఒక మంచి రచనని దృశ్య రూపంగా మార్చడం పెద్ద కళ. పేపర్ మీద చదువుతున్నపుడు కథ అద్భుతంగా అనిపించవచ్చు. కానీ ఆ రచన విజువల్ మీడియాకి పనికొస్తుందా? ఆ డ్రామా విజువల్ గా ప్రేక్షకుడి అలరిస్తుందా? అనే జడ్జ్మెంట్ దర్శకుడిలో వుండాలి. ‘టెస్ట్’ ఆ జడ్జ్మెంటే తప్పింది. మనిషి అంతర్మధనం, మనసు లోపలిపొరల్లో జరిగే సంఘర్షణ, మంచి, చెడు, హీరో, విలన్, గెలుపు, ఓటమి, స్వార్ధం.. ఇలా చాలా లేయర్స్ వున్న కథ ఇది. కానీ ఇందులో ఒక్క లేయర్ కూడా ఆకట్టుకునేలా దృశ్య రూపం దాల్చకపోవడం పెద్ద లోటు.
పేపర్ మీద చూస్తుంటే ఇది బలమైన సంఘర్షణ వున్న కథలా అనిపిస్తుంది. అర్జున్ ఓ పెద్ద స్టార్ క్రికెటర్. తనకి క్రికెట్ అంటే ప్రాణం. కుముద తండ్రి అర్జున్ కి కోచ్. తనలో తప్పులు ఎత్తిచూపుతున్నాడని ఆయన్ని దూరంగా పెడతాడు అర్జున్. చివరికి ఆయన చనిపోయినా పరామర్శకి వెళ్ళడు. చిన్నప్పుడు కలిసి పెరిగిన కుముదని కూడా మర్చిపోతాడు. తనలో ఆడే సత్తువ అయిపొయిందనే విమర్శలు వస్తున్నా ఆటపై మమకారాన్ని వొదులుకోలేడు. చివరికి కొడుకుని కూడా పణంగా పెట్టస్తాడు. ఇలాంటి క్యారెక్టర్ ని చిత్రీకరించిన విధానం మాత్రం చాలా పేలవంగా వుంటుంది. మ్యాచ్ కి మూడు రోజులు వుందనగా టక్ చేసుకొని గ్రౌండ్ లోకి వెళ్లి బిక్కమొహం వేసి చూస్తుంటాడేకానీ బ్యాట్ పట్టుకొని ప్రాక్టీస్ చేసినట్లు, ఆట కోసం శ్రమిస్తున్నట్లుగా ఒక్క విజువల్ వుండదు. అలంటప్పుడు ఆ క్యారెక్టర్ తో అతడి పాషన్ తో ప్రేక్షకుడు ఎలా కనెక్ట్ అవుతాడు.
టెస్ట్ లో చెప్పుకోదగ్గ విషయం ఏదైనా వుందంటే ఆర్ మాధవన్ సెకండ్ హాఫ్ పెర్ఫార్మెన్స్. అప్పటివరకూ టెస్ట్ గా సాగుతున్న ఈ కథని తన పాత్ర, నటనతో వన్డేలా మార్చడానికి ప్రయత్నిస్తాడు. విలన్, హీరో మధ్య తేడాని చూపించే ఆ పాత్రలో మంచి డెప్త్ వుంది. అయితే అది స్పష్టంగా స్క్రీన్ పైకి రాలేదు. మనిషి ఎంత అవకాశవాదో శరవన్ పాత్రలో చూపించిన విధానం మాత్రం బావుంది. నయనతారకి చివర్లో ఓ ఎలివేషన్ షాట్ వుండాలనే రూల్ ప్రకారం ఇందులో కూడా ఓ షాట్ వుంటుంది. అయితే మాధవన్ పాత్రని ముగించిన తీరు అంత సరిగ్గా కుదరలేదు.
టెస్ట్ మ్యాచ్ లా సాగే ఈ కథని చివరి వరకూ భరించేలా చేసింది మాత్రం మాధవన్, సిద్ధార్థ్, నయనతార. ఈ ముగ్గురికి కథలో ఏ పాయింట్ నచ్చిందో కానీ వాళ్ళ ప్రజెన్స్ తో బాగానే లాకొచ్చారు. ముగ్గురిలో మాధవన్ కే ఎక్కువ మార్కులు పడతాయి. మీరా జాస్మిన్ ఎప్పటిలానే పద్దతిగా కనిపించింది. టెక్నికల్ గా సినిమా డీసెంట్ గా వుంది. టెస్ట్ మ్యాచ్ ని బాగానే చిత్రీకరించారు కానీ ఇందులో క్రికెట్ ఐదు శాతమే. తక్కినదంతా హ్యూమన్ డ్రామా. శక్తి శ్రీ గోపాలన్ పాడిన ఓ పాట నేపధ్య సంగీతంగా బావుంది. టైటిల్ కి తగ్గటే టెస్ట్ మ్యాచ్ లా చాలా నెమ్మదిగా సాగే సినిమా ఇది. అంత ఓపిక ఉంటేనే క్లిక్ చేయాలి.