బుల్లి తెరపై కొన్నాళ్ల పాటు హవా నడిపించాడు ప్రభాకర్. ఒకానప్పుడు ఈటీవీ మెయిన్ హ్యాండు తనదే. సుమన్‌తో స్నేహం అతన్ని అందలాలు ఎక్కించింది. ఈటీవీ ఎప్పుడైతే వదిలాడో, అప్పుడు ఆ ప్రభ బాగా తగ్గిపోయింది. సినిమాల్లో వేషాలేసినా అన్నీ అర కొర పాత్రలే. సడన్‌గా దర్శకుడిగా అవతారం ఎత్తాడు. పైగా గీతా ఆర్ట్స్ లాంటి బ్యానర్లో. అదే ఇప్పుడు నెక్ట్స్ నువ్వే పేరుతో విడుదల అవుతోంది. ప్రచార చిత్రాలు చూస్తుంటే హడావుడి కనిపిస్తోంది. అయితే.. హారర్ కామెడీ జోనర్ క్రేజ్రోజు రోజుకీ తగ్గిపోతోంది. థియేటర్‌కి జనాలు వెళ్లడం కష్టమైన పరిస్థితి. పైగా ఆది కి హీరోగా హిట్లు లేవు. ఈ దశలో ‘నెక్ట్స్ నువ్వే’కి కనీస ఓపెనింగ్స్ వస్తాయా అనేది అనుమానంగా మారింది. అన్నిటికి తోడు ఈ శుక్రవారం బాక్సాఫీసు దగ్గర గట్టిపోటీనే ఉంది.
ఇది నిజంగా ప్రభాకర్‌కి పరీక్షా సమయమే. అల్లు శిరీష్ కోసం ఓ కథ పట్టుకొని గీతా ఆర్ట్స్ తలుపు తట్టాడు ప్రభాకర్. ఆ సినిమా పట్టాలెక్కలేదు. అదే సమయంలో `నెక్ట్స్ నువ్వే` అవకాశం వచ్చింది. ఇదేం ప్రభాకర్ సొంత కథ కాదు. ఓ రీమేక్ సినిమా. తనది కాని కథని మైండ్లోకి ఎక్కించుకొని సినిమా తీయడం, అదీ డెబ్యూ మూవీ కాస్త సాహసమే. బుల్లి తెర నుంచి వెండి తెరపైకి వచ్చిన ఓంకార్ వెలిగిపోతున్నాడు. వరుసగా రెండు హిట్లు కొట్టాడు. ఈ తరుణంలో ప్రభాకర్ పై ఒత్తిడి పెరగడం ఖాయం. ఈ సినిమా హిట్టయితే… అల్లు శిరీష్ కథ ఓకే అవుతుంది. దాంతో ఈ ఒత్తిడి ఇంకాస్త పెరగడం ఖాయం. మరి… ప్రభాకర్ ఏం చేస్తాడో చూడాలి.