బ్రిటన్ , ఇటలీ, అమెరికా లాంటి దేశాలతో పోలిస్తే.. ఇండియాలో నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసులు చాలా తక్కువ. ఆయా దేశాల లెక్కలతో పోల్చుకుంటే… చాలా మందికి ఇదే సందేహం వస్తుంది. 130 కోట్ల మంది జనాభాలో పట్టుమని వెయ్యి మందికి రాకపోయినా.. అందర్నీ ఎందుకు హౌస్ అరెస్ట్ చేశారన్న సందేహాలు కూడా వస్తున్నాయి. నిజానికి బయటపడిన కేసులు కాదు.. బయటపడని కేసులే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హడలెత్తిస్తున్నాయి. కరోనా వైరస్ బయటపడిన తర్వాత అన్ని రాష్ట్రాలకు కలిసి ఇరవై లక్షల మంది విదేశాల నుంచి రాకపోకలు సాగించారన్న లెక్కలు కేంద్రం వద్ద ఉన్నాయి. వారెవరో.. చాలా వరకు కనిపెట్టలేకపోయారు.
అన్ని రాష్ట్రాలకు కేంద్రం రిమైండర్లు పంపుతూనే ఉంది. ఎంత మందిని ట్రేస్ చేశారో.. ఎంత మందికి కరోనా లక్షణాలు ఉన్నాయో.. ఎంత మందిని క్వారంటైన్‌కు తరలించాలో ఎప్పటికిప్పుడు.. సమాచారం సేకరిస్తోంది. రాష్ట్రాలు చెప్పే లెక్కలకు… కేంద్రం వద్ద ఉన్న లెక్కలకు పొంతన కుదరడం లేదు. అదే సమయంలో… కరోనా అనుమానితుల టెస్టులు కూడా… వేగంగా సాగడం లేదు. సగటున పది లక్షల మందిలో ఇరవై మందికి మాత్రమే కరోనా టెస్టులు చేస్తున్నారు. కరోనా లక్షణాలతో ఉన్న వారిని ఐసోలేషన్‌కు తరలిస్తున్నారు.. కానీ వారికి టెస్టులు చేయాలంటే.. మూడు, నాలుగు రోజులు పడుతోంది. ఏపీలో ఇంత వరకూ కేవలం 400లోపు కరోనా అనుమానితుల టెస్టులు చేశారు. ఇందులో పదమూడు పాజిటివ్‌గా తేలాయి. అదే కేరళలో.. ఆరు వేల మందికిపైగా కరోనా టెస్టులు చేశారు. అక్కడ 170కిపైగా పాజిటివ్ కేసులు బయటపడ్డాయి.
ఇతర దేశాల్లో ప్రతీ రోజూ.. కొన్ని వేల సంఖ్యలో టెస్టులు చేస్తున్నారు. దాని వల్లనే ఎక్కవ పాజిటివ్ కేసులు బయటకు వస్తున్నాయి. ఇలా ఎక్కువగా చేయడం వల్ల.. బాధితుల్ని త్వరగా కనిపెట్టి ఐసోలేషన్‌కు పంపడం ద్వారా.. వారి నుంచి మరొకరికి వ్యాప్తి చెందకుండా చేసినట్లవుతుంది. అదే పరిమితంగా టెస్టులు చేస్తూ ఉంటే.. కరోనా వైరస్ లక్షణాలు బయటపడని వారు… బయటపడేవరకూ.. ఒకరికొకరికి వ్యాప్తి చేస్తూనే ఉంటారు. అందుకే.. భారత్ అధికారులు టెన్షన్ పడుతున్నారు. టెస్టులు చేయడం పెరిగే కొద్ది.. ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందోనని.. ముందు జాగ్రత్త ఏర్పాట్లు చేసుకుంటున్నారు.