భారతీయ జనతా పార్టీకి టీఆర్ఎస్ పూర్తిగా లొంగిపోయినట్లుగా కనిపిస్తోంది. టీఆర్ఎస్ పై.. కేసీఆర్‌పై బండి సంజయ్ నుంచి సోయం బాపురావు వరకు .. బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో .. ఘాటైన విమర్శలు గుప్పిస్తున్నా.. ఆ స్థాయిలో తిప్పికొట్టడానికి టీఆర్ఎస్ నేతలు ముందుకు రావడం లేదు. బండి సంజయ్‌కు కౌంటర్ ఇవ్వడానికి బాల్క సుమన్ ప్రెస్‌మీట్ ను ఏర్పాటు చేశారు. సాధారణంగా బాల్క సుమన్ ను రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇవ్వడానికి రంగంలోకి దింపుతారు. ఈ సారి బండి సంజయ్ కోసం ప్రెస్ మీట్ ఏర్పాటు చేయించడంతో… రేవంత్ ని తిట్టినట్లుగా తిడతారేమో అనుకున్నారు. కానీ బాల్క సుమన్ చాలా సంయమనం పాటించారు. ప్రజలే బుద్ది చెబుతారని చివరికి ముక్కాయింపునిచ్చారు.
మంత్రి కొప్పుల ఈశ్వర్ కూడా స్పందించారు. కేసీఆర్ ను జైల్లో పెట్టే ముందు కాళేశ్వరం ప్రాజెక్ట్ చూడాలని ఆయన సంజయ్‌కు సూచించారు. కేసీఆర్ ఫామ్ హౌస్ 40 ఎకరాలు మాత్రమేనని చెప్పుకొచ్చారు. తన ఫామ్ హౌస్ విస్తీర్ణం వంద ఎకరాలు ఉంటుందని స్వయంగా చెప్పారు. బీజేపీ విషయంలో సంయమనం పాటించాలనే సంకేతాలు పై నుంచి రావడంతోనే టీఆర్ఎస్ నేతలెవరూ పెద్దగా స్పందించడం లేదు. అయితే.. బండి సంజయ్ అన్న మాటలకు మాత్రం టీఆర్ఎస్ నేతలకు మండిపోతోంది. ఏదో ఒకటి అనాలన్న ఉద్దేశంతో ఉన్నారు. తాము నేరుగా అనలేరు కాబట్టి అనుకూల మీడియా చానల్స్‌లో బండి సంజయ్‌పై ఘాటుగా కథనాలు రాయించారు.
పొగ బండి అని మరొకటి అని… కేసీఆర్ ను జైలుకు పంపేంత ధైర్యం ఉందా అంటూ… రెండో టీ న్యూస్ గా పేరు తెచ్చేసుకుంటున్న మెరుగైన చానల్లో కథనం ప్రసారం చేయించేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీపై నోరు జారితే మొదటికే మోసం వస్తుందని… వీలైనంత వరకూ కామ్ గా ఉండాలని టీఆర్ఎస్ పెద్దలు భావిస్తున్నారు. ఇదే అదనుగా బీజేపీ నేతలు దూకుడు పెంచుతున్నారు. కేసీఆర్ లొంగిపోయారన్న ప్రచారం చేస్తున్నారు. ఇది టీఆర్ఎస్ నేతలకు ఇబ్బందిరంగా మారింది.