శ్రీరస్తు శుభమస్తు మినహాయిస్తే… అల్లు శిరీష్‌కి ఒక్క విజయమూ లేదు. ఆ హిట్టు కూడా.. పరశురామ్ ఖాతాలో పడిపోయింది. సోలో హీరోగా తన స్టామినా చూపించుకోవాలని తెగ తహతహలాడుతున్నాడు శిరీష్. కథల ఎంపికలో ఎంత జాగ్రత్తలు తీసుకున్నా – ఎక్కడో ఓ చోట చేసిన తప్పుకి సినిమా అంతా బలైపోతోంది. అందుకే ఈసారి రిస్క్ తక్కువ ఉండేలా చూసుకుని `ఏ బీ సీ డీ` అనే రీమేక్ కథ ఎంచుకున్నాడు. తీసింది చూసుకుంటూ, మార్పులు చేసుకుంటూ వెళ్లాడు. ముందు అనుకున్న బడ్జెట్ దారి తప్పినా – అస్సలు వెనుకంజ వేయడం లేదు. మంచి డేట్ కోసం.. విడుదల తేదీలు వాయిదా వేసుకుంటూ కాలక్షేపం చేశాడు. మొత్తానికి ఈనెల 17కి ఈ సినిమా ఫిక్సయ్యింది. థియేటర్లో మహర్షి జోరు ఇంకా కొనసాగుతూనే ఉంది. వీకెండ్ అయిన తరవాత కూడా.. వసూళ్లు బాగానే ఉన్నాయి. ఇవన్నీ శిరీష్‌ని కాస్త భయపెట్టేవే. మంచో, చెడో.. పాజిటీవ్గానో, నెగిటీవ్గానో సినీ పరిశ్రమ అంతా మహర్షి గురించే మాట్లాడుకుంటోంది. ఈ దశలో అల్లు శిరీష్ సినిమా రావడం రిస్కే అనుకోవాలి. కాకపోతే ఈ 17 దాటితే మళ్లీ బాక్సాఫీసు బిజీ అయిపోతుంది. చావో, రేవో ఇప్పుడే తేల్చేసుకోవాలి. కామెడీ సీన్లు వర్కవుట్ అవ్వడం, లవ్ ట్రాక్‌లు బాగా రావడం, ఒకట్రెండు పాటలు విడుదలకు ముందే పాపులర్ అవ్వడం.. `ఏ బీ సీ డీ`కి కలసిరావొచ్చు. మొత్తానికి అల్లు శిరీష్‌కి ఇది టెస్టింగ్ టైమ్.