తెలుగు సినిమా మధ్య తెలంగాణ, ఆంధ్రా అనే గీత ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. టికెట్ రేట్ల విషయంలో. ఎందుకంటే… ఓ సినిమాకి ఏపీలో ఒక రేటు ఉంటే, తెలంగాణలో ఒక రేటు ఉంది. ఏపీలో ఉన్న టికెట్ రేట్లకు థియేటర్లని నడపడం కష్టం అంటున్నారు నిర్మాతలు. అయితే తెలంగాణలో సీన్ రివర్స్. ఇక్కడ రేట్లు అమాంతం పెరిగిపోయాయి. ఈ రేట్లకు భయపడి ప్రేక్షకుడు సినిమాకు దూరం అవుతాడన్నది నిర్మాతల ఆందోళన. రెండూ.. `సినిమా`కు దెబ్బే. ఓ రకంగా.. ఏపీలో ఉన్న టికెటింగ్ విధానమే సరైనదంటూ… టీఎఫ్‌సీసీ ఛైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ వ్యాఖ్యానించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈరోజు హైదరాబాద్‌లో టీఎఫ్‌సీసీకి సంబంధించిన కీలకమైన సమావేశం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.21 వల్ల చిన్న నిర్మాతలు దారుణంగా నష్టపోయే పరిస్థితి ఉందని, ఈ జీవోని సంవరించాల్సిన అవసరం ఉందని, ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ప్రతాని చెప్పారు.
జీవో నెం.21 ప్రకారం టికెట్ రేట్లు పెరిగాయి. మల్టీప్లెక్సులో అత్యధికంగా రూ.300 వరకూ వసూలు చేసుకునే వెసులుబాటు వచ్చింది. ఇటీవల విడుదలైన చిన్న సినిమాలకు ఇదే రేటు వర్తించింది. దాని వల్ల చిన్న సినిమాకు ప్రేక్షకులు పూర్తిగా దూరం అయిపోతారన్న భయం నిర్మాతలకు పట్టుకుంది. గ్రామ పంచాయితీకి ఒక రేటు, మున్సిపాలిటీకి ఒక రేటు, జిల్లా స్థాయిలో ఒకరేటు.. అనే విధానం ఉంటేనే తప్ప చిన్న చిత్రాలు బతికి బట్టకట్టలేనివని, ఖచ్చితంగా జీవో 21ను సవరించాలని, ఈ విషయంల ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలే బాగున్నాయని టీఎఫ్‌సీసీ అభిప్రాయ పడుతోంది. కెట్ రేట్లు పెంచుకున్నప్పుడు థియేటర్ రెంట్లు కూడా పెంచాలి.. కానీ పెంచడంలేదు. దీని వల్ల ఎగ్జిబిటర్స్ నష్టపోతున్నారని, ఈ విషయంలో ప్రభుత్వం మేల్కొని జీవో నెం.21ని సవరించాలని టీఎఫ్‌సీసీ కోరుతోంది.