సినిమా పరిశ్రమకు కూడా కరోనా వైరస్ వదిలిపోయింది. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి సినిమా ధియేటర్లలో కూడా వంద శాతం ఆక్యుపెన్సీకి అనుమతి ఇస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకూ సగం సీట్లు మాత్రమే నింపుకునే చాన్స్ ఉంది. సంక్రాంతి సీజన్ లో విడుదలైన సినిమాలకు అలానే బుకింగ్ చేసుకున్నారు. అయినా సీజన్ ను కోల్పోవడం ఇష్టం లేక చాలా మంది సినిమాలు రిలీజ్ చేశారు. కొంత మంది ఫుల్ ఆక్యుపెన్సీ ఎప్పుడు వస్తే అప్పుడు రిలీజ్ చేసుకుందామని ఎదురు చూస్తూ ఉన్నారు. వారి నిరీక్షణ ఫలించింది. కరోనా నిబంధనలు పేరుతో… కొన్ని రూల్స్ అమలు చేయాలని ఆదేశించారు కానీ ఇప్పుడు ఎవరూ పట్టించుకోవడం లేదు. శానిటైజేషన్.. మాస్క్ సహా వివిధ రూల్స్ ఉన్నాయి.
మొదటి రెండు రోజులు అందరూ చూస్తారని అమలు చేస్తారు. తర్వాత సైలెంటవుతారు. అన్ని చోట్లా అదే పరిస్థితి. దాదాపుగా పది నెలల తర్వాత సినిమా పరిశ్రకు పూర్తి స్థాయి బంధనాలు తెగిపోయినట్లయింది. షూటింగ్‌లు ఎప్పుడో ప్రారంభమయినప్పటికీ… సినిమాల విడుదలపై మాత్రమే సస్పెన్స్ ఉంది. కరోన కారణంగా ప్రజలు ధియేటర్లు ఓపెన్ చేసినా వస్తారా రారా అన్న టెన్షన్ ఇండస్ట్రీ వర్గాలకు ఏర్పడింది. దానికి కారణం ఓటీటీలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వెళ్లడం.. విభిన్నమైన కంటెంట్‌ను అందిస్తూండటంతో ధియేటర్లకు వచ్చే వారు తగ్గుతారని అనుకున్నారు.
కానీ పండగ సీజన్లో ఆ తర్వాత రిలీజైన సినిమాల్లో మంచి టాక్ తెచ్చుకున్న వాటికి కలెక్షన్లు బాగానే వచ్చాయి. దీంతో వారిలో ధైర్యం పెరిగింది. ఫిబ్రవరి ఒకటి నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా సాధారణ స్థితికి చేరుకుంటుందని అనుకోవచ్చు. ఒకటి, రెండు భారీ హిట్లు పడితే… మళ్లీ కలెక్షన్ల వర్షం కురిసే చాన్స్ ఉంది. కరోనాపై ప్రజల్లో పెద్దగా భయాందోళనలు లేకపోవడమే కారణం.