తెలుగుదేశం పార్టీ నేతలు అసలు తగ్గడం లేదు. లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయాలని వరుసగా డిమాండ్లు వినిపించిన వారికి హైకమాండ్ గట్టి వార్నింగ్ ఇచ్చింది. వ్యక్తిగత అభిప్రాయాలను పార్టీపై రుద్దవద్దని స్ఫష్టం చేసింది. అంతలోనే చంద్రబాబు, లోకేష్ సమక్షంలో మంత్రి టీజీ భరత్ ఈ డిబేట్ ను సీఎం స్థాయికి తీసుకెళ్లారు.
టీడీపీలో ఫ్యూచర్ లీడర్ లోకేశ్. ఎవరికి నచ్చినా…నచ్చకపోయినా..ఫ్యూచర్ లీడర్ లోకేశ్ . కాబోయే ముఖ్యమంత్రి కూడా లోకేషేనని ప్రకటించారు.
జ్యూరిచ్‌లో తెలుగు పారిశ్రామికవేత్తలతో సమావేశం అయిన సందర్భంలో వారిని ఉద్దేశించి భరత్ మాట్లాడారు. అప్పుడే ఈ క్లారిటీ ఇచ్చారు. భరత్ ఏ ఉద్దేశంతో అన్నారో కానీ అది పార్టీ మీటింగ్ కాదు కాబట్టి వ్యక్తిగత అభిప్రాయం అనుకోవాలి. టీడీపీలో చంద్రబాబు తర్వాత నెక్ట్స్ ఎవరు చర్చే లేదు. ఎందుకంటే పూర్తి స్థాయిలో నారా లోకేష్ పార్టీపై పట్టు సాధిస్తున్నారు. ప్రభుత్వంలోనూ కీలకంగా ఉన్నారు. చంద్రబాబు తర్వాత లోకేషేనని చెప్పాల్సిన పని లేదు. అయినా డిబేట్ ప్రారంభించడమే ఆసక్తికరంగా మారింది.
తెలుగుదేశం పార్టీలో ఫ్యూచర్ సీఎం లోకేషేనని ప్రత్యేకంగా మద్దతు అడగాల్సిన పని కూడా లేదు. అయితే కూటమిలో భాగంగా పవన్ కల్యాణ్ కూడా సీఎం పదవి ఆశిస్తున్నారని కొంత మంది జనసేన నేతలు చెబుతున్నారు. కిరణ్ రాయల్ తాము పవన్ కల్యాణ్ సీఎం కావాలని కోరుకంటున్నామని చెప్పుకొచ్చారు. ఎవరి పార్టీ నేతలకు ఆయా పార్టీల నేతలు సీఎం కావాలని అంటుంది. అలాగే టీడీపీ నేతలకు..చంద్రబాబు తర్వాత లోకేషే సీఎం కావాలని అంటుంది. అందులో వివాదమేమీ ఉండదని భావిస్తున్నారు.