కర్నూలుకి చెందిన మాజీ మంత్రులు టి.జి. వెంకటేష్, ఏరాసు ప్రతాప్ రెడ్డి ఇద్దరూ 2014 ఎన్నికలకు ముందు తెదేపాలో చేరి పోటీ చేసి ఓడిపోయినప్పటి నుంచి వారిద్దరినీ పార్టీలో పట్టించుకొనేవారే లేరు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కర్నూలు పర్యటించినప్పుడు కూడా వారితో మాట్లాడే ప్రయత్నం చేయరు. కనుక జిల్లాకి చెందిన వైకాపా ఎమ్మెల్యేలని తెదేపాలో చేర్చుకొనేటప్పుడు వారిని ముఖ్యమంత్రి సంప్రదిస్తారనుకొంటే అది అత్యాశే అవుతుంది. 2014 ఎన్నికలలో తాము ఎవరి చేతుల్లో ఓడిపోయామో వారినే తమకు మాట మాత్రంగా కూడా చెప్పకుండా పార్టీలో చేర్చుకోవడంతో వారిరువురూ తెదేపా అధిష్టానంపై ఆగ్రహంగా ఉండటం సహజమే. ఒకప్పుడు కాంగ్రెస్ హయంలో మంత్రులుగా చక్రం తిప్పిన వారికి ఈ పరిస్థితి ఎదురవడం జీర్ణించుకోవడం కష్టమే. అందుకే వారిరువురూ వైకాపా వైపు చూస్తున్నట్లు సమాచారం. ఈ మధ్యనే జిల్లాలోని కోడుమూరు మాజీ ఎమ్మెల్యే మురళీ కృష్ణ వైకాపాలో చేరారు. ఎమ్మెల్యేల ఫిరాయింపుల కారణంగా జగన్మోహన్ రెడ్డి చాలా ఆందోళన చెందుతున్నారు. కనుక ఇటువంటి పరిస్థితులో వైకాపాలో చేరి ఆయనకి అండగా నిలబడితే, వైకాపాలో మంచి గుర్తింపు పొందవచ్చని వారు భావిస్తున్నట్లు సమాచారం. అయితే అధికార పార్టీని వీడి నానాటికీ బలహీనపడుతున్న ప్రతిపక్ష పార్టీలోకి వెళ్ళడం మంచిదా కాదా అనే సందిగ్ధంలో ఉన్నందున నిర్ణయం తీసుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది.