ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అనిశ్చిత వైఖరితో.. జిల్లాల్లో కూడా…. హైకోర్టు కోసం ఉద్యమాలు పెరుగుతున్నాయి. ఈ సమయంలో… ఎంపీ టీజీ వెంకటేష్.. కర్నూలును రాజధాని చేయాలనే డిమాండ్‌తో జోరుగా ముందుకు వెళ్తున్నారు. రాయలసీమ వాదాన్ని ఇంకా చెప్పాలంటే.. కర్నూలు వాదాన్ని ఎక్కువగా వినిపించే నేతల్లో టీజీ వెంకటేష్ ముందుంటారు. ప్రభుత్వం తీరు ఇప్పుడు ఆయనకు బాగా కలసి వస్తోంది. అందుకే.. హైకోర్టు ఎలాగూ వస్తుందని చెబుతున్నారు కాబట్టి.. రాజధానిని కూడా కర్నూలులోనే పెట్టేస్తే బాగుంటుందని సలహాలిచ్చేస్తున్నారు. కర్నూలులో రాజధాని ఏర్పాటు చేస్తే ఖర్చు లేకుండా అభివృద్ధి జరుగుతుందని.. ప్రణాళికలు వేస్తున్నారు. రాజధానికి అవసరమైన భవనాలు కర్నూలులో చాలా ఉన్నాయని.. గుర్తు చేస్తున్నారు.
కర్నూలులో రాజధాని ఏర్పాటు అంటే రాష్ట్రాన్ని విడగొట్టడం కాదని.. టీజీ వెంకటేష్ విశ్లేషిస్తున్నారు. అమరావతిని ఫ్రీజోన్ చేయాలని ఎన్ని సార్లు చెప్పినా.. చంద్రబాబు పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు. గత ఐదేళ్లు చంద్రబాబు రాయలసీమను పట్టించుకోలేదని తీర్పిచ్చేశారు టీజీ వెంకటేష్. అయితే ఆ అయిదేళ్లు ఆయన చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీలోనే పని చేశారు. ఎంపీగా.. కూడా పని చేశారు., ఇప్పుడు.. ఆ టీడీపీ ఇచ్చిన ఎంపీ పదవితోనే ఉన్నారు. అప్పుడు ఆయనకు.. రాయలసీమను టీడీపీ, ప్రభుత్వం పట్టించుకోలేదని గుర్తుకు వచ్చినట్లుగా లేదన్న విమర్శలు సహజంగానే వస్తున్నాయి.
ఉమ్మడి మద్రాస్ నుంచి విడిపోయిన తర్వాత సమైక్యాంధ్రా రాజధానిగా మొదట కర్నూలును నిర్ణయించారు. ఆ తర్వాత వివిధ కారణాలతో హైదరాబాద్‌కు తరలించారు. ఈ విషయాన్ని … టీజీ వెంకటేష్ పదే పదే గుర్తు చేస్తూ.. కర్నూలు సెంటిమెంట్‌ను పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. బీజేపీ కూడా ఇప్పుడు.. రాయలసీమవాదం వినిపిస్తున్న సమయంలో… టీజీ కి ప్రత్యేకంగా.. హైకమాండ్ నుంచి పర్మిషన్లు కూడా అవసరం లేకపోయింది. అందుకే..కర్నూలు వాదం… ఓ రేంజ్లో వినిపిస్తున్నారు. ఇది ఎలాంటి మలుపులు తిరగబోతోందో మరి..!