సున్నితమైన సమస్యల విషయంలో రాజకీయ నేతలు అత్యుత్సాహానికి పోయి చేసే ప్రకటనలు ఉద్రిక్తతలు పెరగడానికి తప్ప.. పరిష్కారానికి ఉపయోగపడవు. బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ చేసే ప్రకటనలు ఇలాగే ఉంటాయి. తాను రాయలసీమ హక్కుల పరిరక్షకుడిగా ఫీలయ్యే టీజీ వెంకటేష్.. తాజాగా.. పోతిరెడ్డిపాడు విషయంలో.. అంతే స్పందించారు. శ్రీశైలం ప్రాజెక్ట్ రాయలసీమ భూభాగంలో ఉందని.. అది సీమదేనన్నట్లుగా ఆయన మాట్లాడారు. కేసీఆర్ ఎక్కువ మాట్లాడిదే గెట్ లాస్ట్ అనాల్సి వస్తుందని హెచ్చరికలు జారీ చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు కోసం రాయలసీమ రైతులు 35 వేల ఎకరాలు త్యాగం చేశారని టీజీ గుర్తు చేస్తున్నారు.
సంగమేశ్వరం వద్ద చేపట్టే లిఫ్ట్‌ను టచ్ చేస్తే తెలంగాణ ప్రాజెక్టులన్నీ ఆగిపోతాయని.. ఇలాగే మాట్లాడితే శ్రీశైలం ప్రాజెక్టు మాదే..గెట్ లాస్ట్ అనాల్సి వస్తుందన్నారు. గుండ్రేవుల, సిద్ధేశ్వరం ప్రాజెక్టులకు కూడా జగన్ జీవోలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేసీఆర్.. కృష్ణా ప్రాజెక్టులపై ఎన్నో అక్రమ నిర్మాణాలు చేపట్టారని ఆయన ఆరోపిస్తున్నారు. రాజ్యాంగం ప్రకారం కిందవాళ్ల అనుమతి తీసుకునే ఎగువన ప్రాజెక్టులు కట్టాలని.. కేసీఆర్ ఇష్టారాజ్యంగా ఎగువన ప్రాజెక్టులు నిర్మిస్తున్నారని అంటున్నారు.
ఏపీ, తెలంగాణ సీఎంల మధ్య మంచి స్నేహం ఉంది. సమస్యలను వారు మాట్లాడుకుని పరిష్కరించుకోగలరు కూడా. చాలా సార్లు ఇలా చర్చించారు. తమ రాష్ట్రాల మధ్య ఇక జల వివాదాలే ఉండవని… ఇద్దరు ముఖ్యమంత్రులు ప్రకటించి ఉన్నారు కూడా. ఇలాంటి తేడాలు ఏమైనా వస్తే.. వారు… చర్చించి పరిష్కరించుకుంటారు. కానీ మధ్యలో టీజీ వెంకటేష్ లాంటి నేతలు చేసే దుందుడుకు ప్రకటనల వల్ల.. రాజకీయ ఉద్రిక్తతలు పెరగడం.. ప్రాజెక్టు మరింత వివాదాస్పదం కావడం మినహా.. మరో ప్రయోజనం ఏమీ ఉండదు.