వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టగానే… మంత్రి పదవుల్లో సామాజిక న్యాయం ఎలా చేయబోతున్నారోననే ఉత్కంఠ ప్రారంభమయింది. దానికి జగన్మోహన్ రెడ్డి తనదైన శైలిలో ముగింపునిచ్చారు. ఏకంగా.. ఐదు డిప్యూటీ సీఎం పోస్టులను.. వివిధ సామాజికవర్గాలకు ప్రకటించేశారు. ఆ ఐదుగురికి ప్రాధాన్యతా శాఖలు దక్కలేదనుకోండి.. అది వేరే విషయం.. కానీ డిప్యూటీ సీఎంలు మాత్రం అయ్యారు. ఇప్పుడు.. ఆ కాన్సెప్ట్నే.. ఆంధ్రప్రదేశ్ రాజధానికీ వర్తింప చేయబోతున్నారట. ఏపీకి నాలుగు రాజధానులను… జగన్మోహన్ రెడ్డి ప్రకటించబోతున్నారని… బీజేపీలో విలీనం అయిన టీడీపీ ఎంపీ టీజీ వెంకటేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఢిల్లీ నుంచి తనకు స్పష్టమైన సమాచారం ఉందని చెబుతున్న ఆయన.. ఏపీకి రాజధానిగా అమరావతి కొనసాగకపోవచ్చునని తేల్చేశారు. ఇదే విషయమై బీజేపీ అధిష్టానంతో సీఎం జగన్ చర్చలు కూడా పూర్తి చేశారట. తన పార్టీ హైకమాండ్.. అంటే బీజేపీ హైకమాండే.. తనకు ఆ విషయం చెప్పిందని… టీజీ వెంకటేష్ నిర్మొహమాటంగా చెప్పేశారు. ఏపీకి నాలుగు రాజధానులు ఉండబోతున్నాయని.. విజయనగరం, కాకినాడ, గుంటూరు, కడప జిల్లాలు ఏపీకి రాజధానులు ఉండబోతున్నాయని.. ఆయన తేల్చేశారు. తాను చెప్పేది నూటికి నూరుశాతం నిజమనేశారు.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్న విధానాలను పరిశీలిస్తే.. టీజీ వెంకటేష్ వ్యాఖ్యల్ని అంత తేలిగ్గా తీసిపడేయాల్సిన పరిస్థితి లేదని అర్థం చేసుకోవచ్చు. అభివృద్ధి వికేంద్రీకరణ… రాజధాని అంటూ… వైసీపీ నేతలు కొంత కాలంగా ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో.. ఐదుగురికి డిప్యూటీ సీఎంలు ఇచ్చినట్లుగా.. నాలుగు చోట్ల రాజధానులను ప్రకటించినా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు. ఓ చోట సెక్రటేరియట్.. మరో చోట అసెంబ్లీ.. ఇంకో చోట హైకోర్టు.. ఇంకో చోట రాజ్‌భవన్ పెట్టి… రాజధానులుగా చేస్తే.. అన్ని ప్రాంతాలకు న్యాయం చేసినట్లవుతుందని జగన్ ఆలోచనను.. టీజీ బయట పెట్టారని అనుకోవచ్చు. అసలు సర్కార్ ఆలోచనేమిటో కొద్ది రోజుల్లో బయటపడే అవకాశం ఉంది.