ఈమధ్య పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై వచ్చినన్ని వార్తా కథనాలు మరే సంస్థపైనా రాలేదు. చేతిలో పది పదిహేను సినిమాలున్నాయి. వందల మంది ఉద్యోగులు ఈ సంస్థలో పని చేస్తున్నారు. దాదాపు ఇండస్ట్రీలోని అందరు హీరోలతోనూ, దర్శకులతోనూ డీలింగ్స్ ఉన్నాయి. అందుకే.. ఇలాంటి వార్తలు రావడం కూడా కామనే. ముఖ్యంగా ఈ సంస్థకు కుడిభుజంలా మారిన వివేక్ కూచిభొట్ల బయటకు వచ్చేశారని, వేరే దర్శకుడితో ప్రొడక్షన్ ప్లానింగ్ చూసుకొంటున్నారని వార్తలొచ్చాయి. వీటిపై పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టి.జి.విశ్వప్రసాద్ ఒక్క మాటలో క్లారిటీ ఇచ్చేశారు. ‘ఇవన్నీ రూమర్సే’ అంటూ తేల్చేశారు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలో ప్రక్షాళన జరుగుతోంది కదా, అని అడిగితే ‘ప్రతి సంస్థ కొన్ని నియమ నిబంధనలకు లోబడి పని చేస్తుందని, ఉద్యోగులు వస్తుంటారు, వెళ్తుంటార’ని డిప్లమెటిక్ ఆన్సర్ చెప్పారు. వివేక్ కూచిభొట్ల తమతోనే ఉన్నారని డిక్లేర్ చేశారు. త్రివిక్రమ్ తో పీపుల్ మీడియా ఓ సినిమా చేస్తోందని ఈమధ్య వార్తలొచ్చాయి. దానిపై కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ కథానాయకుడిగా ఓ సినిమా చేయాలని ఎప్పుడో అనుకొన్నామని, అది వర్కవుట్ కాలేదని, అది పూర్తిగా పాత విషయమని తేల్చేశారు.
ఈ సంస్థ నుంచి వస్తున్న ‘ఈగిల్’ విడుదలకు సిద్ధమైంది. ఈనెల 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. నిజానికి సంక్రాంతికి రావాల్సిన సినిమా ఇది. థియేటర్ల సమస్యని తగ్గించడానికి ఈ సినిమా స్వచ్ఛందంగా బరి నుంచి తప్పుకొంది.