బాల్ థాకరే .. మహారాష్ట్రను శాసించిన లీడర్. ఆయన ఎప్పుడూ ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఏ పదవి చేపట్టలేదు. కానీ శివసేన అనే పార్టీతో ఆయన గడగడలాడించారు. ఆయన కనుసన్నల్లో నుంచి ఎవరూ తప్పించుకోలేని పరిస్థితి సృష్టించారు. ఆయన అంటే మాఫియాకూ భయమే. అలాంటి లీడర్ కుటుంబం చేతి నుంచి ఇప్పుడు శివసేన బయటపడింది. బాల్ థాక్రే సృష్టించిన శివసేన వారసులు ఆయన కుటుంబీకులు కాదని తామేనని శివసైనికులు తీర్పునిచ్చారు.
ఉద్దవ్ థాక్రే రాజకీయాల్లోకి రాక ముందు బాల్ థాకరే తరపున శివసేన పార్టీని నడిపింది రాజ్ థాకరే. ఆయన సొంత కుమారుడు కాదు. కానీ సోదరుడు కుమారుడు. రాజ్ థాకరే దూకుడు తత్వమే శివసేనకు బలమని చెప్పుకుంటారు. అయితే రాజ్ థాకరేను పక్కన పెట్టి తన కుమారుడు ఉద్దవ్ కు పట్టం కట్టాలని బాల్ థాక్రే నిర్ణయించుకున్న తర్వాత రాజకీయం మారిపోయింది. రాజ్ థాకరేను మెల్లగా పక్కన పెట్టేయడంతో ఆయన మహారాష్ట్ర నవనిర్మాణ సేన అనే పార్టీ పెట్టుకున్నారు.
ఆ పార్టీతో గొప్ప విజయాలు సాధించలేకపోవచ్చు కానీ ఆయన ఎవరితో పొత్తులు పెట్టుకోరు. కానీ బీజేపీని పొగుడుతూ ఉంటారు. అది హిందూత్వ భావజాలం వల్ల కావొచ్చు. ఆయన ఎప్పుడైనా బయటకు వచ్చి సొంత పార్టీ పెట్టుకున్నారో అప్పటి నుంచి శివసేనకు గడ్డు పరిస్థితులు ఏర్పడ్డాయి. బాల్ థాకరే మరణం తర్వాత ఉద్దవ్ చేసిన స్ట్రాటజిక్ మిస్టేక్లతో మరిన్ని సమస్యలు ఏర్పడ్డాయి. ఇప్పుడు తానే సొంత పార్టీ పెట్టుకోవాల్సి వచ్చింది. అసలు శివసేన శిందే నేతృత్వంలోని శివసైనికుల చేతుల్లోకి వెళ్లిపోయింది