భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు బంగారు బాతుగుడ్డు లాంటిది. అలాంటి బోర్డు అధ్యక్ష పదవికి చాలా క్రేజ్ ఉంటుంది. ఎంతో మంది బడా రాజకీయ నాయకులు, బిలియన్ వ్యాపారులు ఈ పదవి కోసం వెంపర్లాడటం మామూలే. బోర్డులో సంస్కరణలు చేపట్టాలని సుప్రీం కోర్టు సూచిస్తే, అది నావల్ల కాదన్నట్టు శశాంక్ మనోహర్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఇక కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి బోర్డు పెద్దలు సిద్ధమవుతన్నారు. బోర్డు ప్రస్తుత కార్యదర్శి, బీజీపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ కు ఆ అవకాశం దక్కవచ్చని వార్తలు వస్తున్నాయి.
అధ్యక్షుడు రాజీనామా చేశాడు కాబట్టి 15 రోజుల్లో బోర్డు ప్రత్యేక జనరల్ బాడీ సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కార్యదర్శి హోదాలో అనురాగ్ ఠాకూర్ ఆ పనిచేస్తారు. ఆ తర్వాత అధ్యక్షుడి ఎన్నిక జరుగుతుంది.
41 ఏళ్ల అనురాగ్ ఠాకూర్ హిమాచల్ ప్రదేశ్ నుంచి బీజేపీ తరఫున లోక్ సభకు ఎన్నికయ్యారు. ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ప్రేమ్ కుమార్ ధుమాల్ కుమారుడైన ఠాకూర్, రాజకీయ వారసుడిగా తెరపైకి వచ్చారు.
అనురాగ్ ఠాకూర్ 2008లో ధుమాల్ వారసుడిగా తొలిసారి హామిర్ పూర్ నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. 2009 సార్వత్రిక ఎన్నికల్లో రెండో సారి గెలిచారు. 2014లో మూడో సారి విజయం సాధించారు. రాజకీయ వారసుడిగా హిమాచల్ క్రికెట్ బోర్డులో చక్రం తిప్పారు. బీజేపీ ఎంపీ అనే అదనపు అర్హతతో బీసీసీఐలోనూ తనదైన ముద్ర వేశారు. చిన్న వయసులోనే కార్యదర్శిగా ఎన్నికయ్యారు. అధ్యక్షుడిగా ప్రమోషన్ కోసం ఇప్పుడు పావులు కదుపుతున్నారు.
బీసీసీఐ పెద్దల వైఖరే వేరు. పార్టీలు వేరైనా అంతా ఒక్కటే. కాంగ్రెస్, బీజేపీ నాయకులు అంతా కాలిసి బోర్డులో పారదర్శకత రాకుండా అడ్డుకోవడానికి యథాశక్తి ప్రయత్నిస్తూనే ఉంటారు. ప్రస్తుతం అదే జరుగుతోంది. ఐపీఎల్ చైర్మన్ కాంగ్రెస్ కు చెందిన వారు. బీసీసీఐ అధ్యక్షుడు అవుతారని ప్రచారం జరుగుతున్న అనురాగ్ ఠాకూర్ బీజేపీకి చెందిన వారు. బోర్డులో ఇష్టారాజ్యం చెలాయించే విషయంలో పార్టీలకు అతీతంగా మనం మనం బరంపురం అనే తరహాలోనే వ్యవహరిస్తారు. కాబట్టి ఠాకూర్ అధ్యక్షుడిగా ఎన్నికైనా, బీసీసీఐలో పెను మార్పులు, సంన్కరణలు అవకాశాలు ఏమాత్రం ఉండవంటున్నారు పరిశీలకులు. ఏ రాయి అయితే ఏమిటి అన్నట్టు, పగ్గాలు ఎవరి చేతిలో ఉన్నా క్రికెట్ రంగంలో జాఢ్యాన్ని తొలగించే ప్రయత్నం జరగడం లేదనేది చేదు నిజం.