ఎన్నికల ఏడాదిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అత్యంత కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ బాస్‌గా ప్రస్తుతం ఏసీబీ చీఫ్‌గా ఉన్న ఆర్పీ ఠాకూర్‌ను ఎంపిక చేశారు. చివరి వరకూ.. విజయవాడ పోలీస్ కమిషనర్ గౌతం సవాంగ్ పేరు వినిపించింది. చివరికి.. చంద్రబాబు.. ఆర్పీ ఠాకూర్ వైపే మొగ్గు చూపారు. ఆర్పీ ఠాకూర్ పూర్తి పేరు రామ్ ప్రవేశ్ ఠాకూర్. 1986 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. ఠాకూర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పలు ప్రాంతాల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు.
ఆర్పీ ఠాకూర్.. ఏసీబీ చీఫ్‌గా 2016 నవంబర్ 19 నుంచి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆర్పీ ఠాకూర్ ఏసీబీ బాధ్యతలు చేపట్టిన తర్వాత పెద్ద పెద్ద తిమింగలాలను సైతం వదిలి పెట్టలేదు.
అవినీతి పరులపై అక్షరాలా ఉక్కుపాదం మోపారు. ప్రతిరోజూ రెండు, మూడు ట్రాప్‌లు… వారానికి ఒకటి, రెండు ఆదాయానికి మించిన ఆస్తుల పోగేసిన వారి ఇళ్లలో సోదాలు చేపట్టారు. వాట్సాప్, ఫేస్బుక్, మెయిల్ ఐడీలతో సామాజిక మాధ్యమాలను వినియోగించుకొని సెల్ నెంబర్ల లాంటివన్నీ ప్రచారం చేసి కిందిస్థాయి సమాచారం సేకరిస్తూ ఏసీబీ దూకుడుగా పని చేసింది. మొదట పంచాయతీరాజ్ ఇంజనీర్లు, ఆ తర్వాత తహశీల్దార్లు, అక్కడి నుంచి జడ్పీ సీఈవో, డీటీసీ స్థాయి అధికారులపై పడిన ఏసీబీ అధికారులు ఏకంగా ఈఎన్సీలను సైతం పట్టుకున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు విభిన్నమైన ఎన్నికల వాతావరణం. ఏపీలో కులమతాలను రెచ్చగొట్టే కుట్రలు ఎక్కువగా జరుగుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు పదే పదే చెబుతూంటారు. ఎన్నికల ఏడాది మరిన్ని కుట్రలు జరుగుతాయని అంచనా వేస్తూంటారు. అందుకే.. పోలీస్ బాస్‌గా ఆర్పీ ఠాకూర్ బాధ్యతలు కత్తిమీద సామేనని చెప్పవచ్చు.