తమిళ స్టార్ హీరో విజయ్ పార్టీ పెట్టారు. రాబోయే తమిళ నాడు అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయబోతున్నారు. ఈలోగా చేతిలో ఉన్న ‘గోట్’తో పాటు మరో సినిమానీ పూర్తి చేయాలన్నది విజయ్ ప్లాన్. ఒకసారి రాజకీయాల్లోకి అడుగు పెట్టిన తరవాత ఆయన పూర్తిగా సినిమాలకు దూరం అయిపోవొచ్చు. అందుకే విజయ్ చివరి సినిమా ఏమై ఉంటుందా? అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గత రెండు నెలలుగా విజయ్ ఎన్నో కథలు విన్నారు. తెలుగు నుంచి కూడా కొంతమంది దర్శకులు కథలు వినిపించారు. కానీ ఏదీ ఓకే అవ్వలేదు. ఎట్టకేలకు విజయ్ చివరి సినిమాకి దర్శకుడు ఫిక్సయినట్టు తమిళ సినీ వర్గాలు చెబుతున్నాయి.
తమిళంలో కల్ట్ సినిమాలు తీస్తున్న వెట్రిమారన్‌తో విజయ్ ఓ సినిమా చేయబోతున్నాడట. డీవీవీ దానయ్య ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తారని సమాచారం. ఇదో పొలిటికల్ డ్రామా అని తెలుస్తోంది. ఎన్నికలకు ముందు తన ఇమేజ్ పెరిగేలా, ఎలక్షన్లకు బూస్టప్ ఇచ్చేలా ఈ సినిమా ఉండబోతోందని తెలుస్తోంది. 2025 చివర్లో గానీ, 2026 సంక్రాంతికి గానీ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.