తమిళ స్టార్ హీరో విజయ్ తమిళనాడులో కొత్త రాజకీయ పార్టీ ప్రారంభించారు. ఆ పార్టీ పేరును తమిళగ వెట్రి కళగంగా ఖరారు చేశారు. సామాజిక, రాజకీయ, ఆర్థిక సంస్కరణలు తీసుకు రావాలనుకుంటున్నానని .. అది రాజకీయ అధికారంతోనే సాధ్యమని విజయ్ స్పష్టం చేశారు. లోక్ సభ ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతివ్వడం లేదని .. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రమే పోటీ చేస్తామని విజయ్ తెలిపారు. ప్రస్తుతం విజయ్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ .. GOAT అనే సినిమా చేస్తున్నారు.
ఆ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయిందని తెలుస్తోంది. హీరో విజయ్ మొదటి నుంచి సామాజిక అంశాలపై గట్టిగా స్పందిస్తూ ఉంటారు. ఆయనకు రాజకీయ అంశాలపై మొదటి నుంచి ఆసక్తి ఉంది. ఇటీవల తరచూ తన అభిమాన సంఘాలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం తమిళనాడులో రాజకీయ శూన్యత ఉంది. డీఎంకే పార్టీ అధికారపక్షంలో ఉండగా.. స్టాలిన్‌కు సరైన నాయకుడిగా ఇంకెవరూ లేరు. ఆయన స్థాయిలో జనాకర్షణ ఉన్న ప్రతిపక్ష నేత లేకపోవడం వల్ల డీఎంకేకు ఎదురులేదన్న వాదన వినిపిస్తోంది. అన్నాడీఎంకే నేతలు పళనిస్వామి, పన్నీర్ సెల్వం ఇద్దరూ స్టాలిన్ స్థాయికి ఎదగలేకపోయారు. బీజేపీ తమిళనాడు అధ్యక్షుడుగా ఉన్న అన్నామలై కాస్త దూకుడుగా వ్యవహరిస్తున్నప్పటికీ.. మీడియాలో వచ్చినంత క్రేజ్ జనంలో రావట్లేదని అనుకుంటున్నారు.
ఇలాంటి సమయంలో రాజకీయాల్లోకి రావడానికి ఇదే సరైన సమయం అని విజయ్ భావిస్తున్నారు. ఇప్పటికే కమల్ హాసన్ రాజకీయ పార్టీ పెట్టారు కానీ అంతగా క్లిక్ కాలేదు. ఇప్పుడు విజయ్ పార్లమెంట్ ఎన్నికలకు ముందు పార్టీని ప్రకటించారు.అయితే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడం కానీ మరో పార్టీకి మద్దతు ఇవ్వడం కానీ చేయడం లేదని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలను మాత్రమే టార్గెట్ చేసుకున్నారు.