విజయ్, వంశీ పైడిపల్లి, దిల్ రాజుల ‘వారసుడు’ సంక్రాంతి బరిలో దిగుతున్న సంగతి తెలిసిందే. వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్యలు పోటిగా రంగంలో దిగుతున్న ఈ సినిమా ట్రైలర్ బయటికివచ్చింది. ఫ్యామిలీ ఎమోషన్స్, విజయ్ మార్క్ యాక్షన్, మ్యానరిజంతో వారసుడిని తెరకెక్కించారని ట్రైలర్ చూస్తే అర్ధమౌతుంది. ”ఇల్లు అనేది ఇటుక ఇసుకేరా.. వదిలేసి వెళ్లిపోవచ్చు. కుటుంబం అలా కాదు కదా” అని జయసుధ వాయిస్ తో మొదలైన ట్రైలర్ ఒక ఫ్యామిలీ ఎంటర్ టైనరనే ఫీలింగ్ అయితే కలిగించింది. విజయ్ యాక్షన్, డ్యాన్సులు, ఫైట్లు అభిమానులని మెప్పించాయి.
ట్రైలర్ లో కథని కూడా రివిల్ చేశారు. ఒక పెద్ద ఉమ్మడి కుటుంబం. ఆ కుటుంబం పై ప్రకాష్ రాజ్ కన్ను పడుతుంది. కుటుంబాన్ని, వాళ్ళ వ్యాపారాలని నాశనం చేయడయానికి కుట్ర చేస్తాడు. కుట్రని తిప్పికొట్టి తన కుటుంబాన్ని విజయ్ ఎలా ఏకం చేశాడనేది మిగతా కథని ట్రైలర్ చూస్తుంటే అర్ధమౌతుంది. విజయ్ కి తండ్రిగా శరత్ కుమార్, తల్లిగా జయసుధ, బ్రదర్స్ గా శ్రీకాంత్, కిక్ శ్యామ్ కీలక పాత్రల్లో కనిపించారు.
వంశీ పైడిపల్లి తనకు కలిసొచ్చిన ఫ్యామిలీ డ్రామానే తమిళ ఆడియన్స్ కి పరిచయం చేయాలని భావించాడని ట్రైలర్ చెప్పకనే చెబుతుంది. తమన్ నేపధ్య సంగీతం బావుంది. ‘పవర్ సీట్లో వుండదు సర్.. అందులో వచ్చి ఒకడు కూర్చుంటాడే వాడిలో వుంటుంది. మన పవర్ ఆ రకం” అనే డైలాగ్ పేలింది. మొత్తానికి వారసుడు ఒక ఫ్యామిలీ ఎంటర్ టైనర్. సంక్రాంతికి ఫ్యామిలీ ఎలిమెంట్స్ వున్న సినిమాలు బాగా ఆదేస్తాయనేది దిల్ రాజు నమ్మకం. ఆ నమ్మకంతోనే వారసుడిని బరిలో దింపుతున్నారు. జనవరి 12న సినిమా విడుదలౌతుంది.