“చంద్రబాబు కాస్కో .. ఏపీకి వస్తా.. నీకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తా…! “… అనే ఈ డైలాగ్ ఇప్పుడు మహా పాపులర్ అయిపోయింది. ఈ మాట చెబితే.. అనుకున్నవి వచ్చి పడతాయని అనుకుంటున్నారేమో.. అటు కేసీఆర్ దగ్గర్నుంచి ఇటు కేఏ పాల్ వరకూ అందరూ అదే చెబుతున్నారు. ఈ జాబితాలో తాజాగా.. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేశారు. కేసీఆర్ మంత్రి పదవులు భర్తీ చేయడంలో ఆలస్యం చేస్తూండటంతో.. ఉత్కంఠ తట్టుకోలేక.. తనకు మళ్లీ చాన్స్ వస్తుందో .. రాదోనని టెన్షన్ పడిపోతూ… తన ఉనికిని చాటుకోవడానికి.. కేసీఆర్.. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చే సమయంలో… ఓ ప్రెస్ మీట్ పెట్టాడు. దానిలో అసలు ఆయన మాట్లాడాలనుకున్న టాపిక్ బీసీ రిజర్వేషన్లు. బీసీ రిజర్వేషన్లను.. దారుణంగా తగ్గించేయడంపై.. బీసీ సంఘాల నేతలు.. వివిధ పార్టీల్లోని బీసీ నేతలు.. మండి పడుతున్నారు. కేసీఆర్ అన్యాయం చేస్తున్నారని రగిలిపోతున్నారు. వీరిపై విరుచుకుపడి.. ఒక్క బీసీకి కూడా అన్యాయం జరగలేదని.. దానికి తానే సాక్ష్యమని చెప్పుకోవడానికి అన్నట్లుగా ప్రెస్ మీట్ పెట్టేసి.. బీసీల పట్ల కేసీఆర్ చూపించిన ప్రేమను.. వెల్లడించారు.
బీసీల విషయంలో.. తాను చేసిన వాదన కేసీఆర్‌కు నచ్చుతుందో లేదోనన్న సందేహం పట్టి పీడించినట్లు ఉంది. తన మాజీ బాస్… చంద్రబాబు వద్దకు వెళ్లిపోయారు. ఆయనపై కావాల్సినన్ని విమర్శలు గుప్పించారు. ఎప్పుడూ చెప్పే విమర్శలే అయినా.. చివరిలో ఫినిషింగ్ టచ్ ఇచ్చారు. అదేమిటంటే.. కేసీఆర్ చెప్పిటన్లు.. అసదుద్దీన్ చెప్పినట్లు… ఏపీ కి వెళ్లి చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తానని ప్రకటించేశారు. ఓ వైపు లోటు బడ్జెట్ అంటూనే…ధర్మ పోరాటాలంటూ కోట్లు ఖర్చు చేస్తున్నారని .. ఓ కొత్త పాయింట్‌ను పట్టుకున్నట్లుగా చెప్పుకొచ్చారు. ఇలా అన్న తర్వాత ఆయన మనసు కుదుట పడి ఉంటుంది. ఎందుకంటే.. కేసీఆర్ దృష్టిలో పడి ఉండే ఉంటారు కదా మరి..!
టీడీపీలో పుట్టి.. టీడీపీలో పెరిగి.. టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచి.. రాజీనామా చేయకుండానే మంత్రిగా పని చేసిన తలసానికి.. ఇప్పుడు టీఆర్ఎస్ జెండా నుంచి గెలిచిన తర్వాత టెన్షన్ ప్రారంభమయింది. తలసాని ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నారంటే.. ఆయన పేరు మంత్రి వర్గ సభ్యుల జాబితాలో వినిపించడం లేదట. పార్లమెంట్ ఎన్నికల వరకూ.. మరో ఆరేడు మందిని మాత్రమే మంత్రులుగా తీసుకోవాలనుకుంటున్న కేసీఆర్… హైదరాబాద్ నుంచి తలసాని పేరును లెక్క వేయడం లేదంటున్నారు. వేరే పార్టీలో గెలిస్తే మంత్రి పదవి ఇస్తారు.. సొంత పార్టీలో గెలిస్తే పట్టించుకోరా అన్నది ఆయన ఆవేదన. అందులో అర్థం ఉంటుంది. కానీ కేసీఆర్ దగ్గర మాత్రం నిరర్థకమే..!