తమన్.. టాలీవుడ్ లో అత్యంత బిజీ సంగీత దర్శకుడు. పెద్ద సినిమాలన్నీ తమన్ చేతిలోనే. ఈమధ్య హిట్లు కూడా తనే కొట్టాడు. సంగీత దర్శకుడిగా సూపర్ ఫామ్ లో ఉన్నాడు. విచిత్రం ఏమిటంటే… తమన్ పైనే ఎన్నో విమర్శలూ. ట్రోల్లూ. తమన్ ని సోషల్ మీడియాలో ఆడుకున్నట్టు.. ఏ సంగీత దర్శకుడ్నీ ఆడుకోలేదు. కాపీ ట్యూన్ అనగానే ఇప్పటి తరానికి తమనే గుర్తొస్తాడు. కావాలని చేశాడో, అలా జరిగిపోయిందో తెలీదు గానీ.. తమన్ ఇచ్చిన ప్రతీ హిట్ గీతానికి `ఇదిగో కాపీ ట్యూను` అంటూ ఓ పాట వినిపిస్తుంటారు. `కాపీ కొడితే.. ఇంటికెళ్తే మా అమ్మ అన్నం పెడుతుందా` అని తమన్ వాపోతే… దాన్ని కూడా కామెడీ చేసి నవ్వుకున్నారు జనాలు.
అయితే.. తమన్ మాత్రం `నన్ను అప్రతిష్ట పాలు చేయడానికి ఓ టీమ్ పనిచేస్తోంది` అంటూ… వాపోతున్నాడు. తనవి కాపీ ట్యూన్లు కావని మరోసారి బల్లగుద్ది చెబుతున్నాడు. సంక్రాంతికి రాబోతున్న `క్రాక్`కి తమనే సంగీత దర్శకుడు. ఈ సందర్భంగా మీడియాకు తమన్ ఇంటర్వ్యూలు ఇచ్చాడు. ఈసారి కూడా `కాపీ` ప్రశ్నలు తమన్‌ని వెంటాడాయి. “నేను నిజంగా కాపీ కొడితే.. దర్శకులు, నిర్మాతలూ ఊరుకుంటారా? ఇంతింత పారితోషికాలు ఇస్తారా? ఇన్ని సినిమాల ఆఫర్లు వస్తాయా? ఇప్పటి వరకూ.. నాపై ఒక్క ఫిర్యాదు కూడా లేదెందుకు?` అని లాజిక్కులు తీస్తున్నాడు. అయినా తాను వాటి గురించి పట్టించుకోను అన్నాడు. “బిజినెస్ లోని `పిల్ల చావ్`పై వచ్చినన్ని విమర్శలు నాకెప్పుడూ ఎదురు కాలేదు. మరొకరైతే సంగీత దర్శకత్వం మానేద్దురు. కానీ నేను నిలదొక్కుకున్నా. ఆ తరవాత వంద సినిమాలు చేశా. `అల వైకుంఠపురములో` సూపర్ హిట్టయ్యింది. ఆసినిమాలోని పాటలకు గొప్ప స్పందన వచ్చింది. అందుకే నన్ను ఎలా టార్గెట్ చేయాలా? అని ఓ వర్గం ఆలోచిస్తోంది. వాళ్ల పనే ఇదంతా. వాళ్లకు నేను సమాధానం చెప్పాలంటే రెండు నిమిషాల పని. నేను కాపీ కొట్టా అన్నవాళ్లు సొంతంగా ఓ ట్యూన్ చేసి, హిట్టు కొట్టగలరా“ అని సవాల్ విసిరాడు తమన్.
తమన్ పాటల్లో ఒరిజినాలిటీ లేదని కాదు గానీ, కొన్ని పాటలకు మాత్రం ఎక్కడో ఓ రిఫరెన్స్ దొరికేస్తుంటుంది. అయితే అలాంటి పాటలన్నీ హిట్టే. కాబట్టి.. తమన్ సంగీత దర్శకుడిగా ఇంత ప్రభంజన స్థాయిలో ఉన్నాడు. చిత్రసీమలో ఎప్పుడూ హిట్టే మాట్లాడుతుంది. దాని వెనుక విమర్శలూ.. వివాదలూ ఎన్నున్నా చెల్లవు.. అని చెప్పడానికి తమనే ఓ ప్రత్యక్ష నిదర్శనం.