మన నదుల్నీ భాషనీ కాపాడుకోవాలని పిలునిస్తూ… జనసేన `మన నది – మన నుడి` అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నదుల పర్యరక్షణ, మాతృభాష పరిరక్షణ కోసం జనసేన కొన్ని కార్యక్రమాల్ని చేపట్టనుంది. ఈ విషయంపై ప్రజలకు అవగాహన కల్పించడానికి ఓ పాటని రూపొందించింది శతఘ్ని టీమ్. ఈ పాటకు ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ స్వరాన్ని సమకూర్చారు. రామజోగయ్య శాస్త్రి కలం కదిలించారు.
జనజనజన జనసైనికులారా
తరలిరండి పల్లె నుండి పట్నం నుండి
జనజనజనసైనికులారా
మన నదినీ మన నుడినీ కాపాడగరండి
అంటూ సాగే ఈ గీతంలో నదుల విశిష్టతనీ, మాతృభాష అవసరాన్ని, ఇప్పుడు వాటిని కాపాడుకోవాల్సిన కర్తవ్యాన్నీ భోదించే ప్రయత్నం చేశారు. ఓ తెలుగు సినిమాలో ఓ మంచి పాటకు ఉండే అర్హతలన్నీ ఈ పాటకు ఉన్నాయి. ఎప్పటిలానే తమన్ మంచి బీట్ ఉన్న పాటని అందించాడు. తొలి చరణంలో నదుల గురించి, రెండో చరణంలో భాష గొప్పదనం గురించి అవగాహన కలిగించారు. వకీల్ సాబ్ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా కోసం 5 పాటల్ని కంపోజ్ చేశాడు. పనిలో పనిగా ఈ పాటనీ పవన్‌కి కానుకగా ఇచ్చేసినట్టున్నాడు. పవన్ అంటే తమన్‌కి చాలా ప్రేమ. అందుకోసం చాలా తక్కువ సమయంలో ఈ పాటని కంపోజ్ చేసి, రికార్డింగ్ చేసి పెట్టాడు.