తెలుగులో అత్యంత బిజీగా ఉండే మ్యూజిక్ డైరెక్టర్ తమన్. తను మనసు పెడితే, ముఖ్యంగా టైమ్ పెడితే మంచి పాటలే ఇస్తాడు. కాకపోతే.. తన నుంచి ట్యూన్లు తెచ్చుకోవడం అంత సులభం కాదు. తమన్ చెప్పిన టైమ్‌కి ట్యూన్స్ ఇవ్వడం లేదని దర్శక నిర్మాతలు చాటుగా వాపోతుంటారు. `గుంటూరు కారం` లాంటి క్రేజీ ప్రాజెక్టు సైతం తమన్ ట్యూన్లు ఇవ్వకపోవడం వల్ల ఆలస్యం అవుతోంది. అలాంటిది తమన్ నుంచి తనకు కావల్సిన పాటల్ని అతి తక్కువ సమయంలోనే తీసుకొచ్చేశాడు మారుతి.
మారుతి, ప్రభాస్ కాంబోలో ఓ సినిమా రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ చెన్నైలో జరిగాయి. ఈ సిట్టింగ్స్‌లోనే దాదాపు 3 ట్యూన్లు ఓకే అయిపోయాయి. 2024లో విడుదలయ్యే సినిమా ఇది. చాలా టైమ్ ఉంది. ఈలోగానే తమన్ నుంచి మారుతి తనకు కావల్సినట్టు పాటల్ని రాబట్టుకొంటున్నాడు. ఈనెల 4 వరకూ తమన్ తో చెన్నైలో ఉన్న మారుతి. అదే రోజు హైదరాబాద్ ఫ్లయిట్ దిగి, నేరుగా షూటింగ్ కి వెళ్లి, కొన్ని సీన్లు కూడా పూర్తి చేశాడు. ఈ సినిమాకి ప్రభాస్ విడతల వారీగా డేట్లు ఇస్తున్నాడు. ఈ నెలాఖరున మరో 5 రోజుల కాల్షీట్లు ఇచ్చినట్టు తెలుస్తోంది. `సలార్` విడుదల తరవాత.. పూర్తిగా మారుతి సినిమాకే తన డేట్లు కేటాయించే అవకాశం ఉంది.