తమన్ సంగీతంపై విమర్శలు రావడం కొత్తమీ కాదు. ‘బిజినెస్‌మేన్’ నుంచి వున్నాయి. అతణ్ణి కాపీక్యాట్ అనేవాళ్ళు ఎంతమందో! విమర్శల ఏవీ తమన్ జోరును అడ్డుకోలేదు. పదేళ్ళలో త్రివిక్రమ్ శ్రీనివాస్ పన్నెండు సినిమాలు చేస్తే… తమన్ ఐదురెట్లు ఎక్కువ సినిమాలు చేశాడు. అదే సమయంలో ప్రతి సినిమాకీ కాపీక్యాట్ విమర్శలు ఎదుర్కొంటున్నాడు. తాజా ‘అరవింద సమేత వీరరాఘవ’తో సహా! కొన్ని రోజులు క్రితం ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కాపీ పాటలు అని వచ్చిన విమర్శలపై స్పందించారు. తాజాగా ‘అరవింద సమేత..’ విడుదల తరవాత శనివారం మీడియా ముందుకు రాగా… కాపీ మ్యూజిక్ క్వశ్చన్ ఎదురైంది. కాపీ ట్యూన్స్ అనే విమర్శల్ని అసలు పట్టించుకోనని చెప్పిన తమన్… దమ్ముంటే అగ్ర సంగీత దర్శకుల్ని ఇదే విషయమై ప్రశ్నించండని మీడియాకు సవాల్ విసిరారు. ఆ పని ఎవరూ ఎందుకు చేయరు అని కించిత్ కోపం ప్రదర్శించారు. తాను కామ్‌గా ఉంటాను కాబట్టే కాపీ అంటూ విమర్శలు చేస్తున్నారని తమన్ అన్నారు. అసలు కాపీ చేస్తే ఇప్పటివరకూ 60 సినిమాలు వచ్చేవా? త్రివిక్రమ్ అవకాశం ఇచ్చేవారా? అని ఎదురు ప్రశ్నించారు. ఐదు పాటలకు సొంతంగా ట్యూన్స్ ఇచ్చేవాడికి ఆరో పాట చేయడం కష్టమేమీ కాదని తమన్ తెలిపారు. ప్రతి సంగీత దర్శకుడికీ ఒక స్టైల్ వుంటుందనీ, దాన్ని కాపీ అంటే ఎలా? అని తన ఆవేదన వెలిబుచ్చారు.