తమన్ ఇక చిన్న, మీడియం సినిమాలకి దొరకడు. వందకోట్ల బడ్జెట్ వున్న సినిమాలకే తాను సంగీతం అందిస్తానని చాలా నిక్కచ్చిగా చెబుతున్నాడని తెలిసింది. తమన్ చిన్న సినిమాల నుంచే వచ్చాడు. కిక్ తర్వాత తమన్ గ్రాఫ్ మారింది. దూకుడు తర్వాత మరో లెవెల్ కి వెళ్ళాడు. కాపీ ట్యూన్లు చేస్తాడనే విమర్శ వున్నా తమన్ మ్యూజిక్ హిట్ అయ్యింది. తమన్ పాటల్లో బీట్, జోష్ వుంటుంది. మధ్యలో కొన్ని అపజయాలు వచ్చాయి. అయితే ‘అల వైకుంఠపురంలో’ తర్వాత తమన్ హిట్ అనే మాటకు బ్రాండ్ గా మారిపోయాడు. ఏది పట్టుకుంటే అది సూపర్ హిట్ అయ్యి కూర్చుంది. నేపధ్య సంగీతంలో కూడా సూపర్ ఫామ్ లో వున్నాడు. అఖండలోఅయితే బాలయ్యకు సమానంగా తమన్ మ్యూజిక్ కి పేరొచ్చింది. రాధే శ్యామ్ ఫ్లాప్ అయినప్పటికీ తమన్ నేపధ్య సంగీతం సూపర్ అన్నారంతా.
అయితే ఇప్పుడు ఏమైయిందో తెలీదు కానీ వంద కోట్ల బడ్జెట్ లేనిదే తాను మ్యూజిక్ చేయనని చెప్తున్నాడు తమన్. పెద్ద హీరోల సినిమాలతో పాటు మీడియం చిన్న సినిమాలు కూడా పనిచేసే తమన్ ఇప్పుడు ఇలా టర్న్ తీసుకోవడం చర్చనీయంశమైయింది. నిజానికి తమన్ నిర్ణయం కొంచెం వెరైటీగానే వుంది. సంగీత దర్శకుడు తన బడ్జెట్ ఏమిటో చెప్పాలి. మ్యూజిక్ డైరెక్ట్ కి పదికోట్లు ఇచ్చి ఇరవై కోట్ల బడ్జెట్ తీసే సినిమాలు కూడా వుంటాయి. ఇళయరాజా టాప్ ఫామ్ లో వున్నప్పుడు.. తన బడ్జెట్ ఇంతని చెప్పి చిన్న సినిమాలకు సంగీతం అందించి హిట్లు చేసిన సందర్భాలు వున్నాయి. నిజానికి ఒక ఆర్టిస్ట్ లక్షణం కూడా అదే. తన బడ్జెట్ చెప్పి తీసుకోవాలి కానీ సినిమా బడ్జెట్ ఒక కంపోజర్ నిర్ణయించడం ఏమిటో అర్ధం కాదు. సంగీత దర్శకుడికి కావలసినంత ఇచ్చి మంచి మ్యూజికల్ సినిమా చేయాలని ఒక నిర్మాత వస్తే .. నీ బడ్జెట్ వంద కోట్లా ? అని ఒక సంగీత దర్శకుడు అనడం ఏం బావుటుంది?! తమన్ ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడో కానీ .. ఈ నిర్ణయం ప్రకారం అయితే నలుగురు హీరోల సినిమాలి తప్పా మరొకరు తమన్ దగ్గరికి వెళ్ళే అవకాశమే లేదు.