సినిమా బాగుంటే రివ్యూలు ఆటోమెటిగ్గా బాగానే వస్తాయి. తేడా కొడితే… రివ్యూలూ అలానేఉంటాయి. రాధే శ్యామ్ విషయంలో మిక్డ్స్ రివ్యూలు వచ్చాయి. సినిమా స్లోగా ఉందని, ప్రభాస్ ఇమేజ్‌కి ఈ కథ సరిపోలేదని విశ్లేషకులతో సహా, అభిమానులు కూడా తేల్చేశారు. అయితే.. ఇలాంటి రివ్యూలు, కామెంట్లు ఈ సినిమాకి నేపథ్య సంగీతం అందించిన తమన్‌కి ఏమాత్రం నచ్చలేదు. `క్రిటిక్స్‌కి ప్రత్యేకంగా కాలేజీలు ఏమైనా ఉన్నాయా.. వాళ్లు కూడా మనలాంటి ఆడియన్సే కదా..` అని కౌంటర్లు వేస్తున్నాడు తమన్. ఈరోజు `రాధేశ్యామ్` ప్రెస్ మీట్ లాంటిది ఒకటి జరిగింది. ప్రెస్ మీట్ లాంటిది అని ఎందుకు అంటున్నామంటే, ఈ మీడియా మీట్ కి తమన్, దర్శకుడు రాధాకృష్ణ తప్ప ఇంకెవరూ రాలేదు. టాక్ అటూ అటుగా ఉంది కదా, కాస్త పాజిటీవ్ గా మాట్లాడి సెట్ రైట్ చేద్దాం అని… దర్శకుడు రాధాకృష్ణ అనుకుంటే, తమన్ తన ఓవరాక్షన్ తో అది కాస్త పాడు చేశాడు.
మీడియా మీట్ లో ఈ సినిమా నెగిటీవ్ రివ్యూల గురించీ, స్లో ఫేజ్ గురించీ ప్రశ్నలొచ్చాయి. దానికి తమన్ స్పందించాడు. “ఈ సినిమా గురించి ఒకరు నాతో మాట్లాడుతూ `సినిమా చాలా స్లోగా ఉంది` అన్నాడు. నువ్వెవరు అని అడిగితే క్రిటిక్ అన్నాడు. ప్రతోడూ క్రిటిక్కే. ఇక్కడ క్రిటిక్స్‌కి కాలేజ్ లాంటిది ఏమైనా ఉందా` అంటూ ఏదేదో మాట్లాడేశాడు. అంతే కాదు… దర్శకుడు రాధా కృష్ణని ఒక్క ప్రశ్న కూడా అడగనివ్వలేదు. ప్రతీదానికీ తమన్ అడ్డుపడిపోతూ.. `రాధాకృష్ణ చాలా సెన్సిటీవ్… తనని ఏమీ అడక్కండి…ఫీలవుతాడు` అన్నట్టు మాట్లాడాడు. తమన్ ఓవరాక్షన్‌తో.. రాధాకృష్ణ కూడా ఇబ్బంది పడడం స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. ఆయన జవాబులు చెప్పడానికి సిద్ధంగానే ఉన్నా, తమన్ మాత్రం మాట్లాడనివ్వలేదు. ఈ ప్రెస్ మీట్ 40 నిమిషాల పాటు సాగింది. తమన్ ఒక్కడే అరగంట మాట్లాడేశాడు.
తమన్ సంగీతం అందించిన `అఖండ`కి పూర్తిగా పాజిటీవ్ రివ్యూలు వచ్చాయి. తమన్ నేపథ్య సంగీతం గురించి అందరూ కొనియాడారు. అప్పుడు `మీరేం క్రిటిక్స్.. మీకేం తెలుసు` అని అడగని తమన్… `రాధే శ్యామ్`కి నెగిటీవ్ టాక్ వచ్చేసరికి… మీద పడిపోతున్నాడు.
`నా కష్టకాలంలో యూవీ క్రియేషన్స్ నాకు రెండు మంచి ఆఫర్లు ఇచ్చింది. ఈ సినిమాతో నా రుణం తీర్చుకున్నా` అంటూ సెంటిమెంట్ డైలాగులు పలికించాడు తమన్. కొసమెరుపు ఏమిటంటే.. ఈరోజు అన్నపూర్ణ స్టూడియోలో ప్రెస్ మీట్ జరిగింది. నిజానికి పార్క్ హయత్ లో జరగాల్సిన మీట్ ఇది. తమన్ అన్నపూర్ణలో తన సినిమాకి వర్క్ చేసుకుంటున్నాడు. పార్క్ హయత్ వరకూ నేను రాలేను, ప్రెస్ మీట్ పెడితే గిడితే.. అన్నపూర్ణలోనే పెట్టండి.. అనడంతో చిత్రబృందానికి మరో మార్గం లేక.. తమన్ కోరినట్టు అన్నపూర్ణలోనే ఈ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఆ మాత్రం దానికి.. `రుణం తీర్చుకున్నా..` అనే భారీ డైలాగులు ఎందుకో..?!