ఎస్.ఎస్.తమన్… చేతిలో ఎప్పుడూ నాలుగైదు సినిమాలతో బిజీగా ఉండే మ్యూజిక్ డైరెక్టర్. ఇప్పటి వరకూ 60 సినిమాలకు పైగానే పనిచేశాడు. అందులో మాస్ హిట్స్ బోల్డన్ని ఉన్నాయ్. అయితే… ఎస్.ఎస్.. తమన్ అంటే సేమ్ సాంగ్ తమన్ అంటూ సెటైర్లు వేసుకొంటుంటారు సినీ జనాలు. ఆయన పాటలన్నీ ఒకేలా ఉంటాయని విమర్శకులు చెబుతుంటారు. వింటుంటే మనకూ అలానే అనిపిస్తుంది. `మీ పాటలన్నీ ఇంచుమించు ఒకేలా ఎందుకుంటాయ్` అని తమన్‌ని అడిగితే ఆయన ఏం చెప్పాడో తెలుసా??
”ఒకే పాటలు మళ్లీ మళ్లీ ఇవ్వాలని నాకెందుకు ఉంటుంది? ఎప్పుడూ కొత్త బాణీ వినిపించాలనే ప్రయత్నిస్తుంటా. అయితే… నేను పనిచేసిన సినిమాలన్నీ ఇంచుమించు ఒకేసారి విడుదల అవుతున్నాయి. ఏ థియేటర్లో చూసినా.. నా సినిమానే కనిపించిన సందర్భాలున్నాయి. అలాంటప్పుడు ఒకే తరహా పాటలు ఇస్తున్నానని.. అనిపించొచ్చు. అది నా తప్పు కాదు..” అంటున్నాడు. కమర్షియల్ సినిమాలకు పనిచేయడం కష్టమన్నది తమన్ ఉద్దేశం. కమర్షియల్ సినిమాల్లో పాట కోసం పాట తప్ప.. కొత్త సందర్భాలు పుట్టవని, అలాంటప్పుడు కొత్త పాటలు ఎలా వస్తాయన్నది తమన్ మాట. అదీ కరెక్టే కదా?? పాట కొత్తగా ఉండాలంటే. కచ్చితంగా కొత్త పాయింట్‌తో సినిమా తీయాల్సిందే. ఈ విషయంలో దర్శకులే కాస్త కొత్తగా ఆలోచించాలి మరి.