ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో ఇచ్చిన ఛలో అసెంబ్లీ పిలుపు రాజుకుంటోంది. హోదా కావాలని డిమాండ్‌తో నవంబరు 20, సోమవారం తలపెట్టిన ఛలో అసెంబ్లీ కార్యక్రమానికి ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ కూడా ఆదివారం తన మద్ధతు ప్రకటించింది. గత కొంత కాలంగా యువభేరీలతో, దీక్షలతో తాము హోదా సాధన కోసం పోరాడుతున్నామని ఈ సందర్భంగా వైసీపీ నేతలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్‌లు అన్నారు.
ఎప్పుడూ మాట్లాడే శివాజీ తప్ప ఇప్పటిదాకా ఈ సమస్యపై సినీ పరిశ్రమలో ఎవరూ నోరెత్తని పరిస్థితుల్లో… తొలిసారిగా దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరథ్వాజ సైతం మద్ధతు పలకడం విశేషం. చిత్ర పరిశ్రమ నుంచి తన వంతుగా ఈ కార్యక్రమానికి మద్ధతు తెలుపుతున్నానని ఆయన ఆదివారం ప్రకటించారు.
ప్రత్యేకహోదా సాధన కోసం ఉద్యమిస్తున్న అఖిలపక్షంలో సిపిఐ కూడా ప్రధాన పాత్ర పోషిస్తోంది. హోదా పేరిట ఆంధ్రప్రదేశ్‌ను మోసం చేసిన కేంద్రానికి చంద్రబాబు లొంగిపోయాడని సమితి నాయకులు ఆదివారం విమర్శించారు. గవర్నర్‌కు వినతిపత్రం ఇవ్వడం కూడా నేరమైనట్టు అరెస్టులకు పాల్పడుతున్నారని, ఎంత మందిని అరెస్ట్ చేసినా, నాయకుల్ని నిర్భంధించినా చలో అసెంబ్లీ నిర్వహించి తీరుతామని వీరు స్పష్టం చేస్తున్నారు.
ప్రభుత్వం గాని, మంత్రులు గాని, తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలు గాని ఈ కార్యక్రమానికి అనవసరమైన ప్రచారం కల్పించడం ఇష్టం లేనట్టు దీనిపై ఏ మాత్రం స్పందించడం లేదు. ఇదిలా ఉంటే సమితి నాయకులు కోరినప్పటికీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం ఈ కార్యక్రమానికి తన మద్ధతు తెలపనే లేదు. అయితే ఒక్కోసారి తమ నేత స్పందించకున్నా స్పందించే స్థానిక జనసేన కార్యకర్తలు కూడా పెద్దగా ఈ కార్యక్రమాన్ని పట్టించుకున్నట్టు కనపడడం లేదు. ఈ నేపధ్యంలో రేపటి ఛలో అసెంబ్లీ కార్యక్రమం ఎలా జరుగుతుందన్నది వేచి చూడాలి.