హైదరాబాద్: కేసీఆర్ కేంద్ర కార్మికమంత్రిగా ఉన్న హయాంలో ఈఎస్ఐ భవనాల నిర్మాణాలకు నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్ట్లు మంజూరు చేయటంపై సీబీఐ చేస్తున్న దర్యాప్తు, ఇటీవల బయటపడుతున్న మరికొన్ని అక్రమాలపై సీపీఎమ్ తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పందిస్తూ సీఎం వ్యవహారశైలిపై మంచి పాయింట్ లేవనెత్తారు. అవినీతికి పాల్పడ్డాడన్న నెపంతో నాడు ఉపముఖ్యమంత్రి రాజయ్యను కేసీఆర్ మంత్రివర్గంనుంచి బర్తరఫ్ చేశారని, మరి ముఖ్యమంత్రి పదవిలో ఉన్న కేసీఆర్నే సీబీఐ విచారిస్తోంది కాబట్టి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాల్సిందేనని తమ్మినేని అన్నారు. రాజయ్యకో నీతి, తనకో నీతి పాటించటం కేసీఆర్కు తగదని మండిపడ్డారు. ఈఎస్ఐ భవనాల నిర్మాణంలో వెలుగుబంటితో కలిసి అవినీతి, సహారా పీఎఫ్ కుంభకోణంవంటి ఆరోపణలొస్తున్నా మౌనందాల్చటం భావ్యంకాదన్నారు. వివరణ ఇవ్వకపోతే మౌనం అర్థాంగీకారంగా భావించి ప్రజలే బుద్ధి చెబుతారని చెప్పారు. తమ్మినేని పాయింట్ కరక్టే. కనీసం ముఖ్యమంత్రి వివరణ అయినా ఇస్తే బాగుంటుంది. ఏది ఏమైనా తమ్మినేని మంచి పాయింటే పట్టుకుంటారు. ఇంతకుముందుకూడా కేసీఆర్ గురించి ఒక నిశితమైన విమర్శ చేశారు. ఆయన మంచి ఉద్యమ నాయకుడేగానీ, మంచి పరిపాలనా దక్షుడు కాదన్నారు. దానిలోకూడా నిజం లేకపోలేదు. పాలన విషయానికొస్తే కేసీఆర్ అనేక అనాలోచిత నిర్ణయాలు తీసుకోవటం, తర్వాత కోర్టులు మొట్టికాయలవలనగానీ, ప్రజలనుంచి నిరసనలవల్లగానీ వాటిని వెనక్కు తీసుకోవటం తెలిసిందే.