Thandel Movie Review
తెలుగు360 రేటింగ్: 2.75/5
ప్రేమ, దేశభక్తి… ఈ రెండు జోనర్లకూ చావు లేదు. ఎన్నిసార్లు చెప్పి,ఆ ఎంతమంది చెప్పినా బోర్ కొట్టని విషయాలు. కమర్షియల్ గా కూడా వర్కవుట్ అయ్యే పాయింట్లు. ఈ రెండింటినీ మిళతం చేస్తే..? అనే ఆలోచన నుంచి పుట్టిన కథే.. `తండేల్`. ఈ సినిమాపై ముందు నుంచీ పాజిటీవ్ బజ్ నడుస్తోంది. నాగచైతన్య, సాయి పల్లవి కలసి నటించడం, గీతా ఆర్ట్స్ నిర్మించడం, దేవిశ్రీ ప్రసాద్ పాటలు శ్రోతలకు నచ్చేయడం, అన్నింటికి మించి – యదార్థ ఘటనల ఆధారంగా రూపొందించడం వల్ల `తండేల్` అందరి దృష్టినీ ఆకర్షించగలిగింది. అక్కినేని అభిమానులు ఎప్పటి నుంచో ఓ బ్లాక్ బస్టర్ విజయం కోసం ఎదురు చూస్తున్న తరుణంలో వచ్చిన సినిమా ఇది. మరి వాళ్ల అంచనాల్ని ‘తండేల్’ నిలుపుకోగలిగిందా? ఈ సినిమా ఎలా వుంది?
రాజు (నాగచైతన్య), సత్య (సాయి పల్లవి) ఇద్దరికీ ఒకరంటే మరొకరికి ప్రాణం. రాజు మత్య్సకారుడు. సముద్రంలో చేపలు పట్టడం తన జీవనాధారం. తొమ్మిది నెలలు సముద్రంలో ఉంటే, మూడు నెలలు సొంత ఊర్లో ఉంటాడు. ఆ తొమ్మిది నెలలూ.. రాజు – సత్య విరహ వేదనతో రగిలిపోతుంటారు. ఫోన్లో మాట్లాడే ఒక్క రోజు కోసం నెలంతా ఎదురు చూస్తుంటారు. ఈ దూరం భరించలేని సత్య.. `ఇక మీదెప్పుడూ సముద్రపు వేటకు వెళ్లొద్దని, ఇక్కడే ఉండి వేరే పని చూసుకో`మని రాజుని కోరుతుంది. ‘అలాగే’ అని మాటిచ్చిన రాజు, మళ్లీ సముద్రంలోకి వేటకు వెళ్లిపోతాడు. దాంతో రాజుపై అలుగుతుంది సత్య. ఆ అలక.. రాను రాను కోపంగా మారుతుంది. సముద్రంలో వేటకు వెళ్లిన రాజు.. అతని బృందం ప్రయాణించే బోటు పొరపాటున పాకిస్థాన్ బోర్డర్లోకి ప్రవేశిస్తుంది. దాంతో అనుకోని పరిణామలు సంభవిస్తాయి. సత్య – రాజుల మద్య దూరం అనుకోని అగాధంలా మారుతుంది. మరి ఈ దూరం ఎప్పుడు దగ్గరైంది? ఇద్దరూ మళ్లీ కలిశారా, లేదా? అనేదే మిగిలిన కథ.
మత్య్సకారుల జీవితంలో జరిగిన యదార్థ ఘటనల ఆధారంగా రూపొందించిన సినిమా ఇది. దానికి కొన్ని సినిమాటిక్ లిబర్టీస్ జోడించాడు దర్శకుడు. ఈ రెండింటి మేళవింపు చాలా చోట్ల సజావుగానే సాగింది. తనకు ఇష్టం లేకుండా చేపల వేటకు వెళ్లిన రాజుపై.. అలిగిన సత్యని చూపిస్తూ `తండేల్`కు శ్రీకారం చుట్టాడు దర్శకుడు. ఆ తరవాత సత్య, రాజుల ప్రేమకథ మొదలవుతుంది. ఆ ప్రేమలోనూ విరహం, దూరమే కనిపిస్తాయి. రాజు క్యారెక్టరైజేషన్‌ని చూపించడానికి కొన్ని సన్నివేశాల్ని వాడుకొన్నాడు దర్శకుడు. ‘తండేల్’ అంటే నాయకుడు అని అర్థం. ఆ లక్షణాలు రాజులో ఉన్నాయని చెప్పడానికి కొన్ని ఎపిసోడ్లు ఉపయోగపడ్డాయి. అయితే కొన్ని సీన్లు ఫోర్డ్స్‌గా ఉన్నాయి. ఉదాహరణకు.. యాస గొప్పదనం చెబుతూ సాగే ఎపిసోడ్. అది కావాలని ఇరికించిందే అనిపిస్తుంది. ఇలాంటి సన్నివేశాలు ఎంత ఆర్గానిక్ గా ఉంటే అంత బాగుంటాయి. లేదంటే మంచి విషయమే చెప్పినా, ప్రేక్షకుల చెవికి ఎక్కదు.
పబ్లిక్ డొమైన్లో ఉన్న కథల్ని డీల్ చేసే పద్ధతి వేరేలా ఉంటుంది. ఎందుకంటే.. ఆ కథేమిటో ఇది వరకే ప్రేక్షకులకు తెలుసు. తెలిసిన కథని కొత్తగా తీర్చిదిద్దడం అంత తేలిక కాదు. సన్నివేశాలు కొత్తగా రాసుకోవాలి. అయితే చందూ మొండేటి ఉన్న ఎమోషన్ని చూపించడానికి తాపత్రయపడ్డాడే తప్ప, సన్నివేశాల కల్పనలో కొత్త దారులు వెదుక్కోలేకపోయాడు. దాంతో.. సినిమా చాలా నిదానంగా నడుస్తుంటుంది.
దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన మంచి ట్యూన్లు, వాటి పిక్చరైజేషన్ వల్ల… కాస్త రిలాక్సేషన్ దొరుకుతుంది తప్ప, తొలి సగంలో మెరుపులేం అనిపించవు. ఇంట్రవెల్ బ్యాంగ్ కి ముందు నడిసముద్రంలో తుపానులో చిక్కుకొన్న ఎపిసోడ్ విజువల్ గా బాగా తీశారు. అక్కడ క్వాలిటీ ఆఫ్ మేకింగ్ కనిపించింది. అయితే రాజు బృందం పాకిస్థాన్ సముద్ర జలాల్లోకి పొరపాటుగా ప్రవేశించిన సన్నివేశం, అరెస్టయ్యే సందర్భం ఇంకా బాగా తెరకెక్కించాల్సింది. అక్కడే ఇంట్రవెల్ బ్యాంగ్ పడాల్సింది. కానీ ఆ సన్నివేశాన్ని ఇంకాస్త లాగ్ చేశాడు. దాంతో.. థ్రిల్ కాస్త తగ్గినట్టు అనిపిస్తుంది.
దేశభక్తికి సంబంధించిన ఎపిసోడ్లు ద్వితీయార్థంలో వరుస కడతాయి. కొన్ని చోట్ల.. పాత్రలు ఫీలయ్యే ఎమోషనే ప్రేక్షకుల్లో కలుగుతుంది. కొన్ని చోట్ల మిస్ ఫైర్ అయ్యింది. అతికినట్టు అనిపించే సన్నివేశాలు.. కథాగమనానికి అడ్డు తగులుతాయి. కథలో సంఘర్షణ హీరో పాకిస్థాన్‌లో ఇరుక్కుపోవడం. దాంతో పాటు సత్య పెళ్లికి ఒప్పుకోవడం. తొలి సంఘర్షణ కథలోంచి నిజాయతీగా పుట్టింది. రెండోది.. కావాలని తెచ్చిపెట్టుకొన్నది. ఆర్గానిక్‌గా అనిపించదు. దాంతో బలంగా సాగాల్సిన సన్నివేశాలు మెల్లమెల్లగా నీరుగారిపోయాయి. గుజరాత్ వెళ్లి తమకు రావాల్సిన డబ్బుని సాధించిన సీన్.. చాలా సాదాసీదాగా తెరపైకి తీసుకొచ్చాడు దర్శకుడు. ఢిల్లీలో కథానాయిక పోరాటం కూడా మనసుకు హత్తుకొనేలా లేదు. పాకిస్థాన్ లో జైలర్ క్యారెక్టరైజేషన్ కూడా సరిగా రాసుకోలేదు. అతనెప్పుడు ఎలా బిహేవ్ చేస్తాడో మన ఊహకు అందదు. అయితే.. తన జట్టులోని ఒక్కడి కోసం, మళ్లీ పాకిస్థాన్ బోర్డర్లోకి రాజు దూసుకెళ్లిన సీన్ మంచి హై ఇస్తుంది. ఆ సీన్ ఆర్గానిక్‌గా అనిపిస్తుంది. ఇలాంటి సీన్లు సెకండాఫ్‌లో మరో రెండు పడి ఉంటే ‘తండేల్’ టార్గెట్ రీచ్ అయ్యేది.
నాగచైతన్య, సాయి పల్లవిల నటన, వాళ్ల క్యారెక్టరైజేషన్లే ఈ సినిమాకు బలం. ఇద్దరూ తమ తమ పాత్రల్లో ఇమిడిపోయారు. సముద్రంలో షికారుకెళ్లిన జంట చేపల్లా.. మిలమిలలాడారు. ఒడ్డుకు చేరుకొన్న తోడు నావల్లా.. మెరిసిపోయారు. వాళ్ల కెమిస్ట్రీ ఓ అల్లరి కెరటంలా ముచ్చటగా ఉంది. దర్శకుడు రాసుకొన్న సాదాసీదా సన్నివేశాలు సైతం థియేటర్లో ప్రేక్షకుల మెప్పు పొందేలా మారాయంటే దానికి కారణం వీళ్లిద్దరే. సాయిపల్లవిలాంటి కథానాయికకు ఎదురెళ్లడం.. నడి సముద్రంలో తుపానులో ఈత కొట్టడం లాంటిదే. చైతూ.. ఈ సాహసం చేయగలిగాడు. ఈ సినిమాలో ఓ డైలాగ్ ఉంది. `ఎన్ని టాంకర్ల నీళ్లు దాచుకొన్నావ్.. కన్నీరు వస్తూనే ఉంది` అని. దానికి తగ్గట్టే… సాయి పల్లవి ఈ సినిమాలో ఏడుస్తూనే కనిపిస్తుంది. అలా ఒకేరకమైన ఎమోషన్ ప్రేక్షకులు బోర్ కొట్టకుండా పలికించడం మామూలు విషయం కాదు. సాయి పల్లవి వల్లే అది సాధ్యమైంది. ఆడుకాలం నరేన్, ప్రకాష్ బెలవాడీ.. పాన్ ఇండియా ఇమేజ్ కోసం తీసుకొన్న ఆర్టిస్టులు. పెళ్లి కొడుకు పాత్రలో తెలుగు నటుడ్ని తీసుకొంటే బాగుండేది.
ఈ సినిమాకు తెర వెనుక హీరో.. కచ్చితంగా దేవిశ్రీ ప్రసాదే. తన పాటలు ఈ కథకు ప్రాణం పోశాయి. రెండు పాటలు విడుదలకు ముందే సూపర్ హిట్. శివుడి పాట తెరపై చూడ్డానికి ఇంకా బాగుంది. అయితే మూడు పాటలూ తొలి సగంలోనే వాడేశారు. దాంతో ద్వితీయార్థంలో దేవి మ్యాజిక్ వినిపించడానికి వీల్లేకుండా పోయింది. నేపథ్య సంగీతంలోనూ దేవి తన మ్యాజిక్ చూపించాడు. తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హృద్యంగా, సన్నివేశాలకు తగ్గట్టుగా సాగింది. మాటల్లో పెద్దగా మెరుపుల్లేవు. తెలిసిన కథే. కాబట్టి స్క్రీన్ ప్లే పరంగా వైవిధ్యం తీసుకురావాల్సింది. అది జరగలేదు. మేకింగ్ క్వాలిటీ బాగుంది. ఖర్చుకు వెనుకాడలేదన్న సంగతి అర్థమవుతోంది.
అక్కినేని అభిమానులు చాలా కాలం నుంచి ఆకలిగా ఉన్నారు. ఓ సూపర్ హిట్ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ల ఆకలి పూర్తిగా తీర్చే సినిమా కాకపోయినా, కొంతలో కొంత సంతృప్తి పర్చగలిగే కంటెంట్.. ‘తండేల్’లో వుంది.
తెలుగు360 రేటింగ్: 2.75/5