ఈ రోజుల్లో నిర్మాతకు నాన్ థియేట్రికల్ రైట్సే.. బలం. పెట్టుబడిలో సగం వాటి నుంచే వస్తాయి. విడుదలకు ముందు నాన్ థియేట్రికల్ రైట్స్ బిజినెస్ క్లోజ్ చేస్తే ఆ సినిమా దాదాపుగా గట్టెక్కేసినట్టే. ‘తండేల్’ కూడా ఈ విషయంలో విజయం సాధించింది. నాగచైతన్య – సాయి పల్లవి జంటగా నటించిన చిత్రమిది. చందూ మొండేటి దర్శకుడు. గీతా ఆర్ట్స్ రూ.90 కోట్ల భారీ వ్యయంతో నిర్మించింది. అందులో రూ.60 కోట్లు నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో రాబట్టగలిగింది కూడా.
ఓటీటీ హక్కులు నెట్ ఫ్లిక్స్ రూ.35 కోట్లతో కొనుగోలు చేసింది. శాటిలైట్ నుంచి రూ.10 కోట్లు వచ్చాయి. ఆడియో రైట్స్ 7 కోట్లు పలికాయి. హిందీ డబ్బింగ్ రైట్స్ రూపంలో రూ.8 కోట్లు వచ్చాయి. ఇలా మొత్తానికి రూ.60 కోట్లు రాబట్టుకొంది. మరో రూ.30 కోట్లు తెచ్చుకొంటే సినిమా సేఫ్ జోన్లో పడిపోతుంది. నిర్మాతకు నికరంగా రూ.30 కోట్లు రావాలంటే ఆ సినిమా రూ.70 కోట్ల వరకూ రాబట్టాలి. ‘తండేల్’కు మంచి బజ్ ఉంది. బాక్సాఫీసు దగ్గర పోటీ కూడా లేదు. మంచి టాక్ వస్తే.. తప్పకుండా వసూళ్లు దుల్లకొట్టేస్తుంది. ఫిబ్రవరి 7న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. 6న ప్రీమియర్లు ఉంటాయని ప్రచారం జరిగింది. కానీ.. ప్రీమియర్లు లేవని, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ 7నే విడుదల చేస్తున్నామని నిర్మాత బన్నీ వాస్ తెలిపారు.