‘తండేల్’ రిలీజ్ డేట్ గురించి టాలీవుడ్ లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. నాగచైతన్య – సాయి పల్లవి జంటగా నటించిన చిత్రమిది. చందూ మొండేటి దర్శకుడు. షూటింగ్ పూర్తి కావొచ్చింది. మంచి రిలీజ్ డేట్ కోసం చిత్రబృందం ఎదురు చూస్తోంది. డిసెంబరు 20న రావాల్సిన ‘గేమ్ ఛేంజర్’ సంక్రాంతికి షిఫ్ట్ అయిపోవడంతో ఆ స్లాట్ ఖాళీ అయ్యింది. దాంతో ‘తండేల్’ని డిసెంబరులో విడుదల చేస్తారని భావిస్తున్నారు. అయితే అల్లు అరవింద్ మాత్రం ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేస్తే లాభసాటిగా ఉంటుందన్న దిశగా ఆలోచిస్తున్నారు. ఎలాంటి సినిమాకైనా సంక్రాంతికి మించిన సీజన్ దొరకదు. డిసెంబరు కంటే సంక్రాంతికి విడుదల చేయడమే మంచిదన్నది ‘తండేల్’ టీమ్ నిర్ణయం.
అయితే.. సంక్రాంతికి గట్టి పోటీ ఉంది. గేమ్ ఛేంజర్తో పాటు బాలకృష్ణ సినిమా విడుదల కానుంది. తమిళం నుంచి అజిత్ సినిమా వస్తోంది. దాంతో పాటు మరో రెండు సినిమాలు విడుదలకు రెడీ అయ్యాయి. వెంకటేష్ – అనిల్ రావిపూడి సినిమానీ సంక్రాంతికి విడుదల చేయాలి. అయితే అది కూడా దిల్ రాజు సినిమానే. ఒకే సీజన్లో ఒకే సంస్థ నుంచి రెండు చిత్రాలు రావడం అరుదైన సంగతి. గతంలో సంక్రాంతికి మైత్రీ మూవీస్ నుంచి రెండు సినిమాలు వచ్చాయి. రెండూ హిట్టయ్యాయి. అదే ధైర్యంతో దిల్ రాజు కూడా రెండు సినిమాల్ని విడుదల చేయొచ్చు. కానీ ఆయన ‘గేమ్ ఛేంజర్’ విషయంలో ఎలాంటి రిస్క్ తీసుకోకూడదని భావిస్తున్నారు. అందుకే తన సినిమాకి తనే పోటీగా ఉండడాన్ని ఇష్టపడడం లేదు. కాబట్టి వెంకీ సినిమాని ఆయన పక్కన పెట్టే అవకాశాలు ఉన్నాయి. వెంకీ సినిమా గనుక సంక్రాంతి బరి నుంచి తప్పుకొంటే, అప్పుడు ‘తండేల్’ని నిరభ్యంతరంగా విడుదల చేసేయొచ్చు. ఈనెలాఖరులోగా సంక్రాంతి సీజన్లో ఏయే సినిమాలు రాబోతున్నాయన్న విషయంలో ఓ స్పష్టత వస్తుంది. ఆ తరవాతే… ‘తండేల్’ విడుదలపై ఓ నిర్ణయం తీసుకొంటారు.