నాగచైతన్య కెరీర్లోనే భారీ బడ్జెట్ సినిమా ‘తండేల్’. దాదాపు రూ100 కోట్లతో ఈ సినిమాని నిర్మిస్తున్నామని గీతా ఆర్ట్స్ చెప్పింది. ‘తండేల్’ మొదలెడుతున్నప్పుడే 2025 సంక్రాంతికి విడుదల చేస్తామని డిక్లేర్ చేసింది చిత్రబృందం. 2025 సంక్రాంతికి ఈ సినిమా వస్తుందని ఆశించారు అక్కినేని ఫ్యాన్స్. అయితే ఇప్పుడు ఈ పోటీ నుంచి తండేల్ తప్పుకొంది. 2025 ఫిబ్రవరిలో విడుదల చేస్తామని నిర్మాతలు చెబుతున్నారు.
సంక్రాంతికి పోటీ ఎక్కువ ఉంది. బాలయ్య, వెంకీ, రామ్ చరణ్ సినిమాలు సంక్రాంతి బరిలో నిలిచాయి. ఈ దశలో తండేల్ ని దింపడం అంత బెటర్ ఆప్షన్ కాదన్నది గీతా ఆర్ట్స్ అభిప్రాయం. పైగా.. వెంకటేష్ సినిమా బరిలో ఉంది. అలాంటప్పుడు చైతూ రిస్క్ తీసుకోలేడు. పైగా మెగా కుటుంబం నుంచి ‘గేమ్ ఛేంజర్’ వస్తోంది. అందుకే కాస్త వెయిట్ చేయడమే నయం అన్నది గీతా ఆర్ట్స్ అభిప్రాయం కావొచ్చు.
క్రిస్మస్ మంచి ఆప్షప్. కానీ అప్పటికి సినిమా సిద్ధంగా ఉండదు. అందుకే ఫిబ్రవరికి వాయిదా వేశారు. అయితే… అక్కినేని ఫ్యాన్స్ మాత్రం ఈ నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు. కీలకమైన సీజన్లు వదులుకోవడం పెద్ద తప్పన్నది వాళ్ల వాదన. రూ.100 కోట్ల సినిమా కదా, అలాంటప్పుడు సీజన్లో విడుదల చేయడం వల్ల వసూళ్లు భారీగా వస్తాయి, దాన్ని ఎందుకు మిస్ చేసుకొంటారన్నది వాళ్ల ప్రశ్న. అదీ నిజమే. అక్కినేని ఫ్యామిలీ ఎప్పుడూ రూ.100 కోట్ల వసూళ్లు చూడలేదు. ఆ ఫీట్ చూడాలంటే.. సంక్రాంతి లాంటి సీజన్ ని టార్గెట్ చేయాలి. పైగా ‘తండేల్’ భారీ బడ్జెట్ సినిమా. ఆ స్థాయిలో వసూళ్లు రావాలంటే రిలీజ్ డేట్ చాలా ముఖ్యం. ఫిబ్రవరి అన్ సీజన్. పరీక్షల హడావుడి మొదలైపోతుంది. అలాంటప్పుడు ఫిబ్రవరిలో రిలీజ్ చేయడం ఏమిటన్నది అక్కినేని అభిమానుల ఆవేదన. నాగచైతన్య హీరోగా ఇంకా ఎదగాలంటే.. పోటీలో నిలబడి, హిట్ కొట్టాలని, ఆ అవకాశం ‘తండేల్’ ఇచ్చిందని, అయితే దాన్ని సద్వినియోగం చేసుకోవడం లేదని ఫ్యాన్స్ వాపోతున్నారు. ఈరోజు హైదరాబాద్ లో `తండేల్`కు సంబంధించిన మొదటి ఈవెంట్ జరగబోతోంది. టీమ్ అంతా ఈ ప్రెస్ మీట్ లో పాల్గొనబోతున్నారు. ఈ సందర్భంగా ఈ ప్రశ్నకు ఎవరైనా సమాధానం చెప్పి, ఫ్యాన్స్ ని సంతృప్తి పరుస్తారేమో చూడాలి.