Thangalaan Movie Telugu Review
తెలుగు360 రేటింగ్: 2.5/5
కన్నీటి చారికలు…
మట్టి పాదాల ముద్రలు…
పీడిత జనాల పోరాటాలు…
బడుగు జీవుల బ్రతుకులు…
ఇవే డైరెక్టర్ పా.రంజిత్ కథలు. ‘చరిత్ర కొందరి కథలని దాచేసింది. అలా దాగిన కథలని చెప్పడమే నా బాధ్యత’ అని ఎన్నోసార్లు చెప్పుకున్న పా.రంజిత్.. ఇప్పుడు విక్రమ్ తో ‘తంగలాన్’ తీశారు. మరి ఇందులో ఎలాంటి చరిత్ర చూపించారు? ఆ చరిత్రలో దాగిన కథలేమిటి? ఈ చరిత్ర ప్రేక్షకుడికి ఎలాంటి అనుభూతిని పంచింది?
అది బ్రిటిష్ పాలనలోని భారతదేశం. కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువైన చిత్తూరులో కొండకు అనుకోని వున్న గ్రామంలో తన కుటుంబంతో కలసి వ్యవసాయం చేసుకొని బతుకుతుంటాడు తంగలాన్ (విక్రమ్). తనకేవో పిచ్చి పిచ్చి కలలు వస్తుంటాయి. అది కల కాదు.. నిజమేనని అతని నమ్మకం. తన ముత్తాత కర్ణాటకలోని ఏనుగు కొండ దగ్గర పారుతున్న పెన్నానదిలో బంగారం కోసం జల్లెడ పట్టే వాడని, ఆరతి (మాళవిక మోహన్) బంగారం గనులకు కాపలాగా వుండేదని, ఆమె మాయలతో ఆ బంగారాన్ని ఎవరికీ దక్కించేది కాదని, చివరికి ఆరతిని తన ముత్తాత చంపాడని, ఆమె నుంచి పారిన రక్తం అంతా బంగారం మారిందని.. ఇలా ఓ సాహస వీరుడి కథలా తన కలని పిల్లలకి చెబుతాడు. అయితే తంగలాన్ భార్య గంగమ్మ (పార్వతి తిరువోతు) ఇదేం నమ్మదు. అదంతా భ్రమ, పిచ్చి అని కొట్టిపారేస్తుంది. ఇదే సమయంలో కర్ణాటకలో బంగారం గనులు వున్నాయని తెలుసుకుంటాడు బ్రిటిష్ దొర క్లెమెంట్ (డేనియల్ కాల్టాగిరోన్). ఆ బంగారాన్ని వెదికి తీయడానికి సమర్ధులు తంగలాన్ తెగ వారేనని కనుక్కుంటాడు. రోజు కూలీ ఇస్తానని చెప్పి తంగలాన్ తో పాటు మరికొందరిని కర్ణాటక లోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ ప్రాంతనికి తీసుకెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అక్కడ నిజంగానే బంగారు గనులు ఉన్నాయా? తంగలాన్ కి వచ్చే కలకి, తను చిన్నప్పటి నుంచి విన్న కథకి, ఈ ప్రాంతనికి వున్న లింక్ ఏమిటి? నిజంగానే ఆరతి బంగారానికి కాపు కాస్తోందా? తంగలాన్ తెగకి బంగారం సొంతమైయిందా ? ఇదంతా మిగతా కథ.
అణిచివేత నుంచి పుట్టినకథలనే తన సినిమాకి ఇతివృతంగా ఎంచుకున్న పారంజిత్ తంగలాన్ లో కూడా అలాంటి అంశాన్నే డీల్ చేశారు. అయితే ఈ అణిచివేత కథ శతాబ్దాలు దాటి వెనక్కి వెళ్ళింది. చోళులకు పూర్వం నుంచి కుల, మత, వర్ణ వ్యవస్థలని, ఆణిచివేతలని, దోపిడీని తనదైన శైలిలో చూపించే ప్రయత్నం చేశాడు పా. రంజిత్. అయితే ఈ ప్రయత్నం తెరపై చూసి అర్ధం చేసుకోవడానికి వీటన్నిటిపై ప్రేక్షకుడికి ఎంతోకొంత అవగాహన వుండాలి.
తంగలాన్ బ్యాక్ డ్రాప్ కేవలం కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ కాదు. ఈ కథని బంగారం వేట, అడ్వెంచర్ లా చూస్తే నిరుత్సాహపడాల్సివస్తుంది. రాజులు పోయి దొరలు వచ్చినా, దొరలు పోయి పాలకులు వచ్చినా.. ఏ మతం పాటించినా బడుగు బలహీనుల అణిచివేతలో మార్పు లేదని చెప్పడం పా రంజిత్ ఉద్దేశమని చాలా సన్నివేశాల్లో అర్ధమౌతుంటుంది.
తంగలాన్ కుటుంబం, అక్కడి తెగలోని మనుషులు, వారి కట్టుబాట్లు, నమ్మకాలు, ఆహారపు అలవాట్లు పరిచయం చేస్తూ కథమొదలౌతుంది. ఇక్కడే మతం, వర్ణ వ్యవస్థని ఒక డీప్ లేయర్ గా చూపించాడు. తమ తెగని చులకనగా చూస్తున్నారని పశుపతి పాత్ర అక్కడి ప్రజలని శ్రీవైష్ణవంలోకి కన్వర్ట్ చేస్తుంటాడు. తంగలాన్ ముత్తాత కథలో బౌద్ధం ఓ కీలక ఎలిమెంట్ గా వుంటుంది. ఈ రెండు లేయర్లు అర్ధం కావాలంటే.. రామానుజాచార్యుల భక్తి ఉద్యమం గురించి తెలిసుండాలి. అప్పుడు పశుపతి పాత్ర ఆర్క్ ఇంకాస్త లోతుగా అర్ధమౌతుంది.
గ్రామంలో జమీందార్, తంగలాన్ కుటుంబానికి మిగిలివున్న ఆ కాస్త భూమిని కూడా లాక్కోవడం, భూమిని దక్కించుకునే అవకాశం కోసం బ్రిటిష్ దొరతో తంగలాన్ అండ్ గ్రూప్ పయనం కావడంతో బంగారం వేట ఆసక్తి మొదలౌతుంది. బంగారం దొరికే చోటు ఓ మార్మిక భూమి. అక్కడ తంగలాన్ గ్యాంగ్ కు ఎదురయ్యే సంఘటనలు కొన్ని థ్రిల్లింగ్ గా వుంటాయి.
పా. రంజిత్ ఇప్పటివరకూ ఫాంటసీ, అడ్వంచర్ ఎలిమెంట్స్ పెద్దగా డీల్ చేయలేదు. తంగలాన్ లో ఒక ఫాంటసీ ఎలిమెంట్ కుదిరింది. మొదట పిల్లకు ఓ చందమామ లాంటి కథని చూపించి.. అదే కథని చరిత్రగా ఆధారాలతో ముడిపెడుతూ నడిపిన కథనం కొన్ని చోట్ల ఆశ్చర్యపరిస్తే ఇంకొన్ని చోట్ల గందరగోళాని గురి చేస్తోంది.
ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో ఈ గందరగోళం ఎక్కువైయింది. సబ్ టెక్స్ట్ లు, క్యారెక్టర్స్ మెటాఫర్స్ ఎక్కువైపోయాయి. ఇవి కొంతమేరకు ఓకే కానీ ఒక దశలో మామూలు ప్రేక్షకుడికి క్లూలెస్ గా అనిపించే ఛాన్స్ వుంది. నాగజాతి నాయకురాలు ఆరతి క్యారెక్టర్ మొదట్లో ఇంట్రస్టింగ్ గా వుంటుంది కానీ ఆమె బ్యాక్ స్టొరీని మాత్రం కంగారు కంగారుగా ముగించారు, ఇక్కడే తంగలాన్ కు సంబధించిన మరో రూపం కూడా తెరపైకి వస్తుంది. అయితే ఆ ట్రాక్ అంతగా రిజిస్టర్ కాదు. ఈ సంపదంతా అక్కడ బతుకుతున్న ప్రజలదే అనే మెసేజ్ మాత్రం కన్వే చేయగలరు. ఈ సంపద కోసమే ప్రతి తరం కొట్టుకు చస్తుందని, కోరికలే ఈ యుద్ధాలకు ప్రధాన కారణమనే డైలాగ్ బౌద్ధాన్ని అండర్ లైన్ చేస్తుంది.
కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ బ్యాక్ డ్రాప్ తీసుకున్నప్పటికీ ఇందులోనే వర్ణ, కుల, అగ్రవర్ణాల ఆధిపత్యానికి సంబధించి చాలా విషయాలని ప్రస్థావించాడు దర్శకుడు. బ్రటిష్ దొర తంగలాన్ ని మెచ్చుకుంటే దాన్ని వ్యతిరేకంగా ట్రాన్స్ లేట్ చేస్తాడు ఓ గుమస్తా. తంగలాన్ కి బహుమతి గా ఇచ్చిన షర్టు ప్యాంట్ ని కూడా సిపాయిలతో బలవంతంగా చించేస్తాడు. బహుశా బ్రిటిషర్స్ కంటే ఇక్కడ అధికారంలో వున్న అగ్రవర్ణాలే ఎక్కువ అణిచివేతలకు పాల్పడ్డారని చూపించడం పా. రంజిత్ ఉద్దేశం కావచ్చు.
ఈ సినిమా అంత ఒక ఎత్తు విక్రమ్ నటన మరో ఎత్తు, భూతద్దం పెట్టి వేదికినా ఇందులో తంగలాన్ తప్పితే విక్రమ్ కనిపించడు. పరకాయ ప్రవేశం అనే మాట సముచితం. ఒక్క ఫ్రేములో కూడా యాక్ట్ చేస్తోంది విక్రమా? అనే ఆలోచన రాకుండా చేయడం మామూలు మాటలు కాదు. తన ఫిల్మోగ్రఫీలో నిలిచిపోయే పాత్ర ఇది. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఈ పాత్ర తనకు ఎన్నో అవార్డులకు కేరాఫ్ అడ్రస్స్ గా నిలుస్తుంది. గంగమ్మ పాత్రలో పార్వతి జీవించేసింది. ఆరతి పాత్రలో గుర్తుపట్టలేనంత మేకోవర్ లో కనిపించింది మాళవిక. పశుపతి మరోసారి అదరగొట్టారు. క్లెమెంట్ దొరగా డేనియల్ కాల్టాగిరోన్ ఇమిడిపోయారు. మిగతా పాత్రలు కూడా సహజంగా కనిపించాయి.
సినిమా కోసం ఏకంగా ఓ కాలాన్నే క్రియేట్ చేశారు. మొత్తం అవుట్ డోర్. వెయ్యేళ్ళ క్రితంలా కనిపించే లోకేషన్స్ ని పట్టుకోగిలిగారు. గ్రాఫిక్స్ డీసెంట్ గా కుదిరాయి. కెమరాపనితనం బావుంది. జీవి ప్రకాష్ స్కోర్ చేసిన పాటలు రిజిస్టర్ కావు కానీ నేపధ్య సంగీతం మాత్రం పవర్ ఫుల్ గా వుంది. ఆధ్యంతం సన్నివేశాల్ని ఎలివేట్ చేశాడు. రవిక నేపధ్యంలో వచ్చే పాట పారంజిత్ ఒరిజినల్ మార్క్. నిజంగా గొప్ప సిట్యువేషన్ అది. తమ తెగలో తొలిసారి రవిక తొడుక్కున్న మహిళా పడే సంబరం ఆ పాటలో చూపించారు. తెలుగు డైలాగులు, యాస బాగా కుదిరాయి. చిత్తూరు యాసలో డబ్బింగ్ సహజంగా వుంది.
పా. రంజిత్ సినిమాలు పాప్ కార్న్ తిని సరదాగా చూసోచ్చే టైపులో వుండవు. రజనీకాంత్ లాంటి సూపర్ స్టార్ డేట్స్ ఇచ్చినా తన ఐడియాలజీనే కథ చెప్పే డైరెక్టర్ ఆయన. విక్రమ్ లాంటి నటుడు తోడవ్వడంతో ఈసారి ఓ వెయేళ్ళు వెనక్కి కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ తో ముడిపెడుతూ ఓ సీరియస్ టాపిక్ నే చూపించారు. విక్రమ్ నటన, పా. రంజిత్ ఐడియాలజీ ఇష్టపడే ఆడియన్స్ కి ఈ తాతలనాటి బంగారం కథ నచ్చే ఛాన్స్ వుంది. తమిళంలో ఈ సినిమాకు కల్ట్ ఆడియన్స్ దొరకొచ్చు. రేపటి నుంచి పా.రంజిత్ భావజాలాన్ని మరో కోణంలో విశ్లేషకులు ఆవిష్కరించొచ్చు. అయితే తెలుగులో ఈ సినిమా కమర్షియల్ గా పే ఆఫ్ అవుతుందా? అనేది మాత్రం అనుమానం.
తెలుగు360 రేటింగ్: 2.5/5
-అన్వర్-