మురుగు తొలగినప్పుడే.. స్వచ్ఛత బయట పడుతుంది. కొలిమిలో కాలినప్పుడే.. బంగారానికి మెరుపు.
ప్రతీ మనషిలోనూ… ఎక్కడో చోట మానవత్వం ఉంటుంది. దాన్ని తట్టి లేపే క్షణం రావాలంతే. థ్యాంక్యూ బ్రదర్… అలాంటి వ్యక్తి కథే. `నాకేంటి..` అనే ధీమా. `నేనే` అనే స్వార్థం. `నాతోనే` అని అహంకారం.. నిండా ఉన్న ఓ కుర్రాడిని ఓ చిన్న ఘటన మార్చేస్తుంది. అదేంటి? అన్నదే కథ. కరోనా సెకండ్ వేవ్ తో థియేటర్లు మూతబడిన వేళ. ఓటీటీలో విడుదలైన సినిమా ఇది. `ఆహా`లో చూడొచ్చు.
అభి (విరాజ్ అశ్విన్) గొప్పింటి కుర్రాడు. అహంకారం ఎక్కువ. ఆటిట్యూడ్ చూపిస్తుంటాడు. అమ్మ మాటంటే లెక్క లేదు. తాగడం, అమ్మాయిల వెంట తిరగడం, విచ్చలవిడితనం అన్నీ మెండుగా ఉన్నాయి. మరోవైపు ప్రియ (అనసూయ భరద్వాజ్) కథ. భర్త కోల్పోయిన బాధలో ఉంటుంది. నిండు గర్భవతి. ఓసారి ఇద్దరూ లిఫ్టులో చిక్కుకుపోతారు. ప్రియకి నొప్పులు ఎక్కువ అవుతాయి. అభికి ఇలాంటి పరిస్థితి పూర్తిగా కొత్త. మరి ఆ లిఫ్టులో ఏం జరిగింది..? ప్రియని అభి ఎలా కాపాడాడు? అభిలోని మనిషి ఎప్పుడు, ఎలా బయటకు వచ్చాడు? అనేది మిగిలిన కథ.
విదేశీ చిత్రం `ఎలివేటర్ బేబీ` ఈ కథకు ప్రేరణ. టైటిల్ కార్డులో.. మాతృక రచయితలకూ క్రెడిట్ ఇచ్చింది చిత్రబృందం. ట్రైలర్ చూసినప్పుడే కథ అర్థమైపోతుంది. చివరికి ఏం జరుగుతుందన్న విషయాన్ని పసిగట్టేయొచ్చు. తొలి భాగమంతా.. అభి ఆటిట్యూడ్ చూపించడానికి సరిపోయింది. డబ్బుందన్న అహంకారం. డబ్బుని చూసి చుట్టూ చేరిన స్నేహితులు, అమ్మాయిలతో ఆడుకోవడం, వాళ్లని వాడుకోవడం… అంతా ఇదే. లిఫ్టులో చిక్కుకోవడం నుంచి ద్వితీయార్థం మొదలవుతుంది. డాక్టరు సలహాతో…అభి.. ప్రియని కాపాడడం అంతా సెకండాఫ్ లో జరుగుతుంది. ప్రియ పాత్రకు ఇచ్చిన నేపథ్యం కూడా సో… సోగా ఉంటుంది.
గమ్యం దాదాపుగా ఇలాంటి స్టోరీనే. డబ్బుందన్న అహంకారంతో విచ్చల విడిగా ప్రవర్తించే ఓ కుర్రాడు.. ఎలా మారాడన్నదే ఆ కథ. తన చేతిలో ఓ శిశువు ఊపిరి పోసుకోవడం, తన చేతిలోనే ఓ స్నేహితుడి ఊపిరి పోవడంతో… జీవితం అంటే అర్థం, అందులో ఉన్న అర్థం తెలుస్తుంది. ఇక్కడా అంతే. కాకపోతే ఆ కథని మలిచిన తీరే వేరు. ఇలాంటి కథలు ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వాలి. అలా జరగాలంటే.. ఆ పాత్రల నడక, నడత అన్నీ ప్రేక్షకులకు నచ్చాలి. ఆ పాత్రల్ని ఫీల్ అవ్వాలి. అయితే…. `థ్యాంక్యూ` బ్రదర్‌లో అవేం జరగవు. చివర్లో కథానాయికుడిలో వచ్చే మార్పు కృత్రిమంగా ఉంటుంది. ఇనిస్టెంట్ గా కనిపిస్తుంది. ఎమోషన్ ని బలంగా పండించడంలో దర్శకుడు విఫలం అయ్యాడు . అందుకే పాత్రలు పెయిన్ అనుభవిస్తున్నా.. ఆ ఫీల్ ప్రేక్షకుడి గుండెల వరకూ చేరదు.
విరాజ్ అశ్విన్ తన ఆటిట్యూడ్ బాగానే చూపించాడు. క్లైమాక్స్‌లో కూడా తన నటన ఓకే అనిపిస్తుంది. అనసూయకు ఇది డిఫరెంట్ రోలే. ఎప్పుడూ గ్లామర్ కురిపించే పాత్రలు పోషించే అనసూయ.. ఓ కొత్త తరహా పాత్ర పోషించింది. వీరిద్దరు మినహాయిస్తే.. ఎవరి స్క్రీన్ స్పేస్ ఎక్కువగా ఉండదు. గంటన్నర పాటు సాగే సినిమా ఇది. నిడివి ఎంత తక్కువో అర్థం చేసుకోవొచ్చు. అయినా సరే.. సన్నివేశాలు రిపీట్ అవుతున్న ఫీలింగ్ కలుగుతుంది. బోర్ కొడుతుంది. ద్వితీయార్థం అంతా ఓ లిఫ్టులోనే. తొలి సగంలో కూడా… లొకేషన్లు తక్కువగా కనిపిస్తాయి. నిర్మాణ పరంగా… నిర్మాతలకు వెసులుబాటు కల్పించిన కథ ఇది. ఓటీటీకి ఇవ్వడం వల్ల… సేఫ్ జోన్ లో పడిపోయి ఉంటారు. ఎమోషన్స్ పండాలంటే.. పాత్రలు బలంగా ఉండాలి. సన్నివేశాల్లో గాఢత కనిపించాలి. లేదంటే బలమైన సంభాషణలు కావాలి. ఇవన్నీ అరకొర పలికిన సినిమా ఇది.
ఫినిషింగ్ టచ్: సారీ బ్రదర్