వెబ్ సిరీస్ అనగానే మైండ్ అంతా.. థ్రిల్లర్, క్రైమ్ కామెడీ జోనర్ వైపుకు వెళ్లిపోతోంది. నిజానికి… ఈ మాధ్యమంలో ఎన్నో అందమైన ప్రేమకథలూ చెప్పొచ్చు. వెండి తెరకి తీసుకురావాలంటే కాస్త ఆలోచించే కథలతో ఓటీటీలో ప్రయోగాలు చేయొచ్చు. ఓటీటీ ప్రేక్షకులు భారీదనం కోరుకోరు. స్టార్లు అక్కర్లెద్దు. కంటెంట్ సరిపోతుంది. తెలుగులో ఇప్పటి వరకూ చాలా వెబ్ సిరీస్లొచ్చాయి. వాటిలో సింహభాగం థ్రిల్లర్లే. యూత్ ని టార్గెట్ చేసుకుని కొన్ని కథలు చెప్పినా అందులోనూ సెక్స్, హింసకి అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఇప్పుడు ఓటీటీ వేదికగా… ఓ యూత్ ఫుల్ … టీనేజ్ లవ్ స్టోరీ వచ్చింది. అదే.. `తరగతి గది దాటి`. ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. `తరగతి గదిలో` ఉన్న కంటెంట్ ఏమిటి? యూత్ కి ఎంత వరకూ నచ్చుతుంది?
ముగ్గురు స్నేహితుల కథ ఇది. కిట్టు, రామ్, మధు ముగ్గురూ స్నేహితులు. కిట్టుకి చదువు కంటే వంటలపై ధ్యాస. రామ్ కి అల్లరెక్కువ. మధు అయితే వాలీ బాల్ ప్లేయర్ కావాలనుకుంటుంది. ఈ ముగ్గురూ చదువుకుంటున్న ట్యూషన్ సెంటర్లోనే కొత్తగా జాస్మిన్ అనే అమ్మాయి అడుగుపెడుతుంది. జాస్మిన్ ని తొలి చూపులోనే ప్రేమిస్తాడు కిట్టూ. మధుపై రామ్ కీ కూడా అలాంటి ఫీలింగే కలుగుతుంది. మరి ఈ రెండు ప్రేమకథలూ ఏ తీరానికి చేరాయో.. ఓటీటీ తెరపై చూడాల్సిందే.
పెద్దగా కథేం లేదు. ఫ్రెండ్ షిప్, లవ్, చిన్న చిన్న ఎమోషన్స్ తప్ప. ఈ వెబ్ సిరీస్ చూస్తున్నంతసేపూ.. హ్యాపీడేస్ గుర్తొస్తుంది. అది కాలేజీలో జరిగే లవ్ స్టోరీ అయితే.. ఇది ట్యూషన్ సెంటర్ లవ్ స్టోరీ. కిట్టు, మధు, రామ్ ల ఫ్రెండ్ షిప్. ఆ లేత వయసులో మనసులో జరిగే సంఘర్షణ, ఆకర్షణ.. ప్రేమ, ఫ్రెండ్ షిప్ లో చిన్న చిన్న అపార్థాలూ.. మళ్లీ కలిసిపోవడం – ఇదీ ఈ వెబ్ సిరీస్. మొత్తం 5 ఎపిసోడ్లు ఉన్నాయి. వెబ్ సిరీస్ కదా అని మరీ సాగదీసేయ్యకుండా ఒక్కో ఎపిసోడ్ నీ 20 నుంచి 25 నిమిషాల్లోనే ముగించాడు. మధ్యమధ్యలో ఒకట్రెండు బిట్ సాంగ్స్. సరదా సంఘటనలు.. అల్లర్లతో హాయిగా సాగిపోయింది. పెద్దగా మలుపులేం ఉండవు గానీ – చివరి వరకూ చూసేయొచ్చు. యూత్ ఫుల్ కథ కదా అని ముద్దులూ.. కౌగిలింతలూ, రొమాన్స్ జోలికి పోకుండా చాలా క్లీన్ గా, నీట్ గా ఓ కథ చెప్పాడు. అక్కడే దర్శకుడికి మార్కులు పడిపోతాయి.
లెక్కలు, థీరమ్స్ తో.. సన్నివేశాల్ని, సంఘటనల్నీ పోలుస్తూ చాలా త్వరగా కథలోకి తీసుకెళ్లిపోయాడు. ఇదే కథ.. కాలేజీలో చెప్పొచ్చు. బడ్జెట్ సమస్యో.. లేదంటో రొటీన్ అనే ముద్ర వేస్తారనో తెలీదు గానీ… పల్లెటూర్లలో ఉండే ట్యూషన్ సెంటర్ కి షిప్ట్ చేశాడు. మధు – రామ్ ల ట్రాక్ చూస్తే.. హ్యాపీడేస్ లో నిఖిల్ – గాయత్రిల లవ్ ట్రాక్ గుర్తొస్తుంది. అందులో గాయత్రి కాస్త రౌడీ టైపు పాత్ర. నిఖిల్ పై డామినేషన్ చూపిస్తుంటుంది. నిఖిల్ గాయత్రిని తిట్టుకుంటూనే.. లవ్ లో పడిపోతాడు. ఇక్కడా అదే జరుగుతుంది. పరీక్షలు, మార్కుల గోల కూడా ఉంటుంది. తండ్రి పాత్రని చక్కగా రాసుకున్నారు. మాటలు బాగున్నాయి. తరగతి గది దాటి కూడా కథెక్కడా బయటకు రాలేదు. ఏ లైన్ లో కథ చెప్పాలనుకున్నాడో.. ఆ లైన్ ని దర్శకుడు ఎక్కడా క్రాస్ కాలేదు.
నలుగురు ప్రధాన పాత్రధారులకీ మంచి మార్కులు పడతాయి. కిట్టూ నటనలో సిన్సియారిటీ ఉంది. రామ్ నటనలో ఈజ్ ఉంది. జాస్మిన్ చూడ్డానికి బాగుంది. వాళ్లెవరూ నటించినట్టు ఎక్కడా కనిపించదు. పాత్రలకు తగ్గట్టు నటీనటుల్ని ఎంచుకున్నాడు దర్శకుడు. వీళ్లందరికీ భవిష్యత్తులో మరిన్ని అవకాశాలొస్తాయి. నేపథ్య సంగీతం కూల్ గా ఉంది. అయితే రెహమాన్, ఇళయరాజాలకు కూడా ఆ క్రెడిట్ ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ల పాటలు కొన్ని చోట్ల ఆర్.ఆర్గా వాడుకున్నాడు. ఓ టీనేజీ లవ్ స్టోరీని చాలా క్యూట్ గా రాసుకుని, ఆ హద్దుల్లో ఉంటూనే, ఇంటిల్లిపాదీ చూసేలా తీర్చిదిద్దాడు దర్శకుడు. రన్ టైమ్ కూడా తక్కువే కాబట్టి.. హాయిగా చూసేయొచ్చు.