‘పెళ్ళి చూపులు’ చిత్రంతో ప్రేక్షకులు, పరిశ్రమ ప్రముఖుల దృష్టిని ఆకర్షించి… ‘ఈ నగరానికి ఏమైంది?’ చిత్రంతో సగటు వాణిజ్య చిత్రాలకు దూరంగా కొత్త తరహా చిత్రాలు తీయడం తనకు ఇష్టమని చాటిన దర్శకుడు తరుణ్‌భాస్కర్. దర్శకుడిగా మూడో చిత్రం ఎలా తీస్తాడోనని అందరూ ఎదురుచూస్తున్న తరుణంలో… అతను దర్శకత్వానికి చిన్న విరామం ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. తరుణ్ భాస్కర్ నటుడిగా కొత్త అవతారం ఎత్తబోతున్నాడనే విషయం తెలిసిందే. తాజా సమాచారం ఏంటంటే… తీవ్రవాద నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారట! ఇందులో తరుణ్‌భాస్కర్ హైదరాబాద్ పాతబస్తీ యువకుడిగా కనిస్తారని టాక్. తమిళ యువకుడు దర్శకత్వం వహించే ఈ చిత్రం త్వరలో సెట్స్ మీదకు వెళ్తుందని తెలిసింది. చిత్ర పరిశ్రమకు తరుణ్‌భాస్కర్ దర్శకుడిగా పరిచయమైనా… నటుడిగా ఈ చిత్రంతో అతడి ప్రయాణంలో కొత్త అధ్యాయం మొదలవుతుంది. దర్శకుడిగా పేరు తెచ్చుకున్న అతను నటుడిగా ఎలా రాణిస్తాడో?!!