పెళ్లి చూపులుతో ఓ న్యూ ఏజ్ సినిమాని పరిచయం చేశాడు తరుణ్ భాస్కర్. ఆ సినిమాకి ఎన్నో అవార్డులు, రివార్డులు వచ్చాయి. తరుణ్ పేరు మార్మోగింది. హీరోగా విజయ్ దేవరకొండకు ఓ గొప్ప ఫ్లాట్ ఫామ్ దొరికింది. ఈ సినిమాతో వెలుగులోకి వచ్చిన చాలామంది జీవితాలు స్థిరపడిపోయాయి. పాపం.. తరుణ్ ఒక్కడే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదేమో అనిపిస్తోంది.
పెళ్లి చూపులు తరవాత ఈ నగరానికి ఏమైంది అంటూ ఓ సినిమా తీశాడు. ఆ సినిమా కొత్తగా ఉన్నా, ఆదరణకు నోచుకోలేదు. వెంకటేష్‌తో ఓ సినిమా ప్రపోజల్ వచ్చినా అది ఇంత వరకూ కార్యరూపం దాల్చలేదు. వెంకీ ఎవరెవరికో అవకాశాలు ఇస్తున్నాడు గానీ, తరుణ్‌ని మాత్రం పట్టించుకోవడం లేదు. ఈలోగా ఖాళీగా ఉండడం ఎందుకూ అని నటుడిగా ప్రయత్నించాడు. ఫలక్ నామా దాస్ లో చిన్న వేషం వేశాడు. మీకు మాత్రమే చెప్తాతో హీరో అయ్యాడు. నటుడిగా తనకు మంచి మార్కులు పడ్డాయి. కానీ.. ఈసారీ తన కష్టం ఫలించలేదు. అటు దర్శకత్వం, ఇటు నటన రెండిటా అవకాశాల్ని అందిపుచ్చుకోలేకపోయాడు తరుణ్. ఇప్పుడు ఓ టాక్ షో తో యాంకర్ అవతారం ఎత్తబోతున్నాడు `మీకు మాత్రమే చెప్తా`అనే ఓ షో ద్వారా సెలబ్రెటీలను ముఖా ముఖీ చేయబోతున్నాడు తరుణ్. ఫలానా పని మాత్రమే చేస్తా అని మొండి పట్టు పట్టుకోకుండా తనకు నచ్చిన పని చేసుకుంటూ ముందుకు వెళ్లడం ఆనందించదగిన విషయమే. కానీ ఓ మంచి దర్శకుడు దర్శకత్వం తప్ప అన్నీ చేయడం మాత్రం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మంచి దర్శకులు లేరు అని బాధపడుతున్న ఇలాంటి తరుణంలో తరుణ్‌కి మాత్రం అవకాశాలు రాకపోవడం బాధాకరమే.