వెబ్ సిరీస్ సందడి తెలుగులో మొదలైంది. ఇప్పటివరకూ స్టార్ హీరోలు, దర్శకులు వెబ్‌లోకి అడుగు పెట్టలేదు కానీ… కాస్త పాపులారిటీ వచ్చిన యువ దర్శకులు వెబ్‌లోకి అడుగు పెడుతున్నారు. దర్శకురాలు నందినీరెడ్డి ఊహల్లోంచి వచ్చినవే… యప్ టీవీ ‘మన ముగ్గురి లవ్‌స్టోరీ’, తరవాత అమెజాన్ ‘గ్యాంగ్‌స్టార్స్’ వెబ్ సిరీస్‌లు! నెట్‌ఫ్లిక్స్ కోసం ‘బాహుబలి’లోని ఫేమస్ క్యారెక్టర్ ‘శివగామి’ మీద దర్శకులు దేవకట్టా, ప్రవీణ్ సత్తారు వెబ్ సిరీస్ చేస్తున్నారు. ‘పెళ్లి చూపులు’, ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాల దర్శకుడు తరుణ్ భాస్కర్ కూడా వెబ్‌లోకి అడుగు పెడుతున్నారు. ఈ నెల 15న జీ తెలుగు యాప్ ‘జీ5’లో ‘బీటెక్’ అని ఒక వెబ్ సిరీస్ వస్తుంది. యూట్యూబ్ బ్యాగ్రౌండ్ నుంచి వచ్చిన తరుణ్ భాస్కర్ ఆ వెబ్ సిరీస్‌కి స్ర్కీన్‌ప్లే రాశాడు. అతని స్నేహితుడు ఉప్పు దర్శకత్వం వహించాడు. తన్వీ దేశాయ్, ప్రతీక్ ప్రభాన్, వివేక్… సినిమా ప్రేక్షకులకు ఎక్కువగా తెలియని ఆర్టిస్టులు ఇందులో నటించారు. ‘‘నేను రాసిన స్ర్కిప్ట్స్‌లో నాన్న చదివిన స్ర్కిప్ట్ ఇది ఒక్కటే’’ అన్నారు తరుణ్ భాస్కర్. దర్శకుడిగా ఇతడితో మూడు సినిమాలు నిర్మిస్తామని సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబు ఇటీవల పేర్కొన్నారు. అవి ఎప్పుడు మొదలవుతాయో?