తరుణ్ భాస్కర్… తీసింది ఒకే ఒక సినిమా. అయితే తనే ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండ్రస్ట్రీ అయ్యాడు. పెళ్లి చూపులు సినిమాతో పరిశ్రమ మొత్తాన్ని తన వైపుకు తిప్పుకొన్నాడు తరుణ్ భాస్కర్. ఇప్పుడు అతని ముందు అవకాశాలు క్యూ కడుతున్నాయి. అయితే.. హీరోల ఎంపికలో తాను ఆచి తూచి స్పందిస్తున్నాడు. ఆఖరికి… అఖిల్ లాంటి యంగ్ ఛార్మింగ్ హీరో కథ అడిగినా నో చెప్పాడట. అయితే ఇది ఇప్పటి మాట కాదు. రెండేళ్ల క్రితం. ఈ విషయాన్ని అఖిల్ స్వయంగా చెప్పుకొచ్చాడు. తరుణ్ భాస్కర్ తీసిన షార్ట్ ఫిల్మ్స్ చూసిన అఖిల్ వెంటనే తనని పిలిచి మంచి కథ ఉంటే చెప్పమని అడిగాడట. అయితే.. తరుణ్ మాత్రం ”మీకు తగిన కథలు నా దగ్గర లేవు” అన్నాడట. అలా.. తరుణ్ భాస్కర్ – అఖిల్ ల కాంబినేషన్ మిస్సయ్యింది. అయితే తరుణ్ భాస్కర్‌తో సినిమా చేయాలన్న కోరికను వ్యక్తం చేశాడు అఖిల్.
”పెళ్లి చూపులు చూశా. చాలా బాగా నచ్చింది. నా రియల్ లైఫ్‌లో సన్నివేశాలు చాలా వరకూ కనెక్ట్ అయిపోయా. యూత్ కూడా ఈ సినిమాకి బాగా కనెక్ట్ అయ్యారు. తరుణ్‌తో సినిమా చేయాలని వుంది. ఈ విషయాన్ని ఎప్పుడో చెప్పా. తనదే ఆలస్యం” అంటున్నాడు అఖిల్. పెళ్లి చూపులు థ్యాంక్స్ మీట్ ఈరోజు (ఆదివారం) రామానాయుడు స్టూడియోలో జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన అఖిల్ యూనిట్ మొత్తాన్ని అభినందించాడు.