మహా గాయకుడు ఘంటసాల మరణంతో తెలుగు చి్త్రసీమ సందిగ్థంలో పడ్డ రోజులవి. ముఖ్యంగా ఎన్టీఆర్, ఏఎన్నార్ లకు పాలు పోని పరిస్థితి. ఎందుకంటే.. వాళ్ల సినిమాలంటే ఘంటసాల పాట ఉండాల్సిందే. ఘంటసాల కాకుండా మరే గాయకుడు పాడినా – వాళ్ల బాడీ లాంగ్వేజ్‌కి అస్సలు మ్యాచ్ కాదన్న భయం. అయితే.. ప్రత్యామ్నాయంగా రామకృష్ణ కనిపించారు. ఆయనతో కొన్ని పాటలు పాడించుకున్నారు కూడా. కానీ ఏదో లోటు. ఆ సమయంలోనే గాయకుడిగా తొలి అడుగులు వేస్తున్నారు బాలసుబ్రహ్మణ్యం. అప్పటికే కృష్ణ, కృష్ణంరాజు తదితర హీరోల సినిమాలకు పాటలు పాడారు. కానీ.. స్టార్ లీగ్‌లోకి చేరలేదు.
ఇలాంటి సమయంలోనే ఎన్టీఆర్ సినిమాకి పాట పాడే అవకాశం వచ్చింది బాలుకి. దీక్ష సినిమాలో.. `మెరిసే మేఘమాలిక… ఉరుములు చాలు చాలిక` అనే పాట పాడారు బాలు. అదే ఎన్టీఆర్‌కి బాలు పాడిన తొలి పాట. ఆడియో పరంగా.. మంచి హిట్ గీతం. కానీ.. తెరపై ఎన్టీఆర్ బాడీ లాంగ్వేజ్‌కీ, బాలు గొంతుకీ పొత్తు కుదర్లేదు. దాంతో.. ఘంటసాల లేని లోటు స్పష్టంగా కనిపించింది. ఈలోగా.. ఏఎన్నార్ కి పాడే అవకాశం తలుపు తట్టింది. `ఆలు మగలు` సినిమాలో `ఎరక్కపోయి వచ్చాను నేనిరుక్కుపోయాను` అనే పాట పాడారు. పాట రికార్డింగ్ జరిగిపోయింది కూడా. దాన్ని తనదైన స్టైల్ లో పాడుకుంటూ వెళ్లాడు బాలు. కానీ. తీరా పాట వింటే.. నాగేశ్వరరావు శైలికి ఏమాత్రం కుదర్లేదు. ఈ సినిమాకి టి.చలపతిరావు సంగీత దర్శకుడు. ఆయన బాలుని పిలిచి.. `ఈ పాట నాగేశ్వరరావు స్టైల్‌కి తగ్గట్టు లేదు.. `అనేశారు. ఆల్రెడీ ఎన్టీఆర్ విషయంలో ఫెయిల్ అయ్యాను, ఇప్పుడు ఏఎన్నార్ విషయంలోనూ పరాజయం తప్పదా? అని బాలు బాధపడుతుంటే. చలపతిరావు ఓ సలహా ఇచ్చారు.
`ఎన్టీఆర్, ఏఎన్నార్‌ల గొంతు వేరు. ఘంటసాల గొంతు వేరు. కానీ.. ఘంటసాల పాట పాడితే.. వాళ్లే పాడారా? అన్న స్థాయిలో ఉంటుంది. దానికి కారణం.. వాళ్ల హావభావాల్ని సైతం… ఘంటసాల ఒడసిపట్టుకోవడమే. గాయకుడికి మిమిక్రీ తెలిసి ఉండాలి. ఆ కళ తెలిస్తే.. ఎవరి పాటని వాళ్ల స్టైల్ లో పాడొచ్చు. ఎన్టీఆర్, ఏఎఎన్నార్ల హావభావాల్ని, వాళ్ల స్టైల్ ని మేనరిజంనీ బాగా గమనించు.. తప్పకుండా వాళ్లలానే పాట పాడగలవు` అని సూచించారు.
దాంతో పునరాలోచనలో పడ్డారు బాలు. రెండ్రోజుల పాటు ఏఎన్నార్ హావభావాల్ని పరిశీలించి, దానికి తగ్గట్టుగా తన స్టైల్ మార్చుకుని `ఎరక్కపోయి వచ్చాను.` పాటని మళ్లీ పాడారు. మరోసారి ఆ పాటని రికార్డు చేయించి చలపతిరావుకి వినిపిస్తే.. ఆయనే ఆశ్చర్యపోయారు. పాట సూపర్ హిట్ అయ్యింది. అప్పటి నుంచీ ఏఎన్నార్ సినిమాలకు రెగ్యులర్ సింగర్ గా మారి, ఘంటసాల స్థానాన్ని భర్తీ చేయడం మొదలెట్టారు బాలు. ఇదే సూత్రాన్ని ఎన్టీఆర్‌పైనా ప్రయోగించారు. బాలకృష్ణ, చిరంజీవి తరం లోనూ ఇంతే. వాళ్ల శైలిని పుణికిపుచ్చుకుని పాటలు పాడడం వల్ల.. ఆయా పాటలు మరింత ఆదరణ పొందాయి.
”టి.చలపతి రావు ఇచ్చిన సలహాతోనే నా పాట శైలిని మార్చుకున్నా. హీరోలకు తగ్గట్టుగా పాడడం నేర్చుకున్నా. అది నా జీవితాన్ని మార్చేసింది” అంటూ ఓ సందర్భంలో గుర్తు చేసుకున్నారు బాలు.