వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు నిందితులను ఇక నుంచి హైదరాబాద్ లోని చంచల్ గూడ జైల్లోనే ఉంచనున్నారు. వివేకా హత్య కేసు విచారణ హైదరాబాద్‌కు సుప్రీంకోర్టు బదిలీ చేయడంలో తొలి సారిగా శుక్రవారం విచారణ జరిగింది. విచారణలో భాగంగా నిందితులను కడప నుంచి హైదరాబాద్ తీసుకొచ్చారు. విచారణను వచ్చేనెల 10వ తేదీకి వాయిదా వేసింది.. నిందితుల్ని చంచల్ గూడ జైలుకు తరలించాలని ఆదేశించింది. శివశంకర్‌రెడ్డి, ఉమాశంకర్‌రెడ్డి, సునీల్‌యాదవ్ ఇక హైదరాబాద్ జైల్లోనే ఉంటారు. వీరు కడప జైల్లో ఉంటే ఇష్టానుసారంగా వారిని అందరూ కలిసేవారన్న ఆరోపణలు ఉన్నాయి.
మరో ఇద్దరు నిందితులు ఎర్ర గంగిరెడ్డి, అప్రూవర్‌గా మారిన దస్తగిరి బెయిల్‌పై బయట ఉన్నారు.గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్ ను కూడా తెలంగాణ హైకోర్టు విచారించనున్నారు. సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ పై… సుప్రంకోర్టు.. తెలంగాణ హైకోర్టు విచారించాలని ఆదేశిచింది. త్వరలో ఈ అంశంపైనా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
సీబీఐ ఇటీవల వివేకా హత్య కేసులో దూకుడు పెంచింది. తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో పని చేసే కృష్ణమోహన్ రెడ్డి, నవీన్ అనే ఇద్దరు ఉద్యోగుల్ని కడప సబ్ జైలుకు పిలిపించి ప్రశ్నించారు. ముందు ముందు మరికొంత మందికి నోటీసులు జారీ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది.
రాజకీయంగా సున్నితమైన కేసు కావడంతో ఈ కేసులో ప్రతీ అంశం హైలెట్ అవుతోంది. కడప కోర్టు నుంచి నిందితుల్ని ఇక హైదరాబాద్ జైల్లోనే ఉంచనున్నారు. ఇంతకు ముందే కేసుకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ సీబీఐ కోర్టుకు చేరాయి. ఇప్పుడు నిందితులు కూడా హైదరాబాద్ చేరారు. ప్రత్యక్షంగా అనేక సార్లు వివేకా హత్య ఘటన జరిగిన ప్రాంతంలో సీబీఐ విచారణ జరిపింది. ఇక కేసు విచారణ మొత్తం హైదరాబాద్ కేంద్రంగానే జరిగే అవకాశాలు ఉన్నాయి.