ఓ యువతి అత్యాచారానికి గురైంది. తీవ్రంగా గాయాలపాలై చనిపోయింది. నిందితులకు శిక్ష పడాలని కుటుంబసభ్యులు పోరాడుతున్నారు. ఆ నిందితులు ఆమె కుటుంబసభ్యుల్ని దారుణంగా హత్య చేస్తారు. పోలీసు వ్యవస్థ, ప్రభుత్వం అన్నీ అదే కరెక్ట్ అన్నట్లుగా సహకరిస్తూ ఉంటాయి. ఇదంతా సినిమాల్లో జరుగుతుందని మనం అనుకుంటాం. కానీ నిజంగానే జరిగింది. ఉత్తరప్రదేశ్‌లో జరిగింది.
హత్రాస్ అత్యాచార ఘటన గురించి గత ఏడాది దేశం మొత్తం చర్చించుకుంది. యూపీలోని హత్రాస్ జిల్లాలోని పందొమ్మిదేళ్ళ దళిత యువతిపై నలుగురు అగ్ర వర్ణాలవారు సామూహిక అత్యాచారం చేశారు. ఆమె తీవ్ర గాయాలతో ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. ఆమెను రాత్రికి రాత్రి స్వగ్రామానికి తీసుకు వచ్చి బంధువులకు తుది చూపుకు కూడా నోచుకోకుండానే పోలీసులు అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటన ఢిల్లీలోని నిర్భయ ఘటనను పోలి ఉండటంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. రాజకీయంగానూ కలకలం రేపింది. ప్రియాంక, రాహుల్ హాత్రాస్ వెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ పోలీసులు అడ్డుకున్నారు. రేప్ ఘటనపై యూపీ సర్కార్ సిట్ ను నియమించింది.
ఈ కేసులో యూపీ ప్రభుత్వం, పోలీసులు వ్యవహరించిన తీరును ప్రజలతోపాటు కోర్టులు తప్పు పట్టాయి. యువతి అంత్యక్రియల విషయంలో పోలీసులు వ్యహరించిన తీరును అలహాబాద్ హైకోర్టు మండిపడింది. ఆ తర్వాత ఈ కేసును సీబీఐకి ఇచ్చారు. అయితే సమాంతరంగా సిట్‌తో యోగి ఆదిత్యనాథ్ దర్యాప్తు చేయించారు. ఈ కేసును ఎటూ తేల్చకుండా మసిపూసి మారేడుకాయ చేశారు. ఆ తర్వాత కేసులో ఎలాంటి పురోగతి లేదు. చివరికి నిందితులకు బెయిల్ వచ్చింది.
బెయిల్ వచ్చిన వెంటనే రేప్ కేసు ప్రధాన నిందితుడు గౌరవశర్మ.. హత్రాస్ వచ్చారు. తాను రేప్ చేసి చంపేసిన యువతి తండ్రిని దారుణంగా హత్య చేశాడు. నిందితుడి వద్ద తుపాకీ కూడా ఉంది. ఆలయం వద్ద ఉన్న బాధిత యువతి తండ్రిని చంపడానికి ప్లాన్ ప్రకారం వచ్చాడు. నిందితులకు బెయిల్ వచ్చిన తర్వాత.. రేప్ బాధితురాలి కుటుంబసభ్యులకు ప్రాణహాని ఉంటుందని తెలిసినా ఎవరూ పట్టించుకోలేదు. ఫలితంగా బాధిత కుటుంబానికి దిక్కు లేకుండా పోయింది. ఇలా స్వతంత్ర భారతంలో మాత్రమే సాధ్యం. ఇంత అనాగరిక న్యాయం అమలవుతున్న ప్రజాస్వామ్య దేశం.. ఎవరికీ రక్షణ ఉండని.. కల్పించలేని దయనీయమైన వ్యవస్థ మన దేశంలోనే ఉంటుందేమో..?