ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన మధ్య పొత్తులు కుదరకూడదని చాలా ప్రయత్నాలు చేసిన వైసీపీకి షాక్ తగిలింది. చివరికి పొత్తులు ఖరారు అయ్యాయి. సీట్ల సంఖ్యపై ఒకటి, రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఏడు పార్లమెంట్, పది అసెంబ్లీ స్థానాలను బీజేపీ ప్రాథమికంగా కోరింది. అయితే ఇప్పటి వరకూ తాము చేసిన కసరత్తును బట్టి నాలుగు పార్లమెంట్, ఆరు అసెంబ్లీ స్థానాలు ఇచ్చేందుకు సిద్ధమని చంద్రబాబు చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ అంశంపై ఈ రోజు.. రేపట్లో తేలిపోతుంది. అధికారికంగా ఎన్డీఏ చేరిక విషయాన్ని ప్రకటించినప్పుడు ఎన్ని సీట్లలో ఎక్కడెక్కడ పోటీ చేసేది కూడా ప్రకటించే అవకాశం ఉంది.
బీజేపీ .. టీడీపీ, జనసేన కూటమిలో చేరకుండా ఉండేందుకు వైసీపీ అధినేత జగన్ ఎన్నో ప్రయత్నాలు చేశారు. గతంలో చంద్రబాబు ఢిల్లీ వెళ్లినప్పుడు తాను కూడా హడావుడిగా ఢిల్లీ వెళ్లి.. పార్లమెంట్ లో ప్రధాని మోదీని కలిసి తాను సంపూర్ణ మద్దతుదారుగా ఉంటానని.. ఎన్డీఏలోకి టీడీపీని చేర్చుకోవద్దని కోరినట్లుగా ప్రచారం జరిగింది అవసరమైతే తాను ఎన్డీఏలో చేరేందుకు సిద్ధమని చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే బీజేపీ మాత్రం పెద్దగా పట్టించుకోలేదని తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి.
వైసీపీ కోరికను నీలి మీడియా చాలా సార్లు బయట పెట్టింది. టీడీపీ షాక్.. బీజేపీ ఒంటరి పోరు అంటూ తరచూ బ్రేకింగ్‌లు వేసి తమ కోరికను .. ఫేక్ న్యూస్ ద్వారా అయినా తీర్చచుకునే ప్రయత్నాలు చేశారు. వారి ప్రయత్నాలు అన్నీ వమ్ము అయ్యాయి. బీజేపీకి ఇచ్చే సీట్లకు ప్రతిఫలంగా టీడీపీ కోరుకునేది.. నిష్పాక్షికమైన ఎన్నికల నిర్వహణ మాత్రమే. ఈ విషయంలో బీజేపీ మాట మీద ఉంటుందని టీడీపీ నేతలు నమ్ముతున్నారు.