ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మంత్రుల కంటే సలహాదారులు ఎక్కువ ఉన్నారు. వారికి క్యాబినెట్ ర్యాంకులు కూడా ఉన్నాయి. వివిధ శాఖలకు, ముఖ్యమంత్రికి కలిపి మొత్తం 37 మంది సలహాదారులు ఉన్నారు. వీరిలో నీలం సాహ్నిని ఎస్ఈసీగా నియమించారు. ఆమె కాకుండా క్యాబినేట్ ర్యాంక్ లో పది మంది వరకు సలహాదారులు ఉన్నారు. వీరందరికీ లక్షలలో జీతాలు అందుతున్నాయి. జీత భత్యాలు కలిపి ఒక్కొక్కరికి నెలకు రూ. ఏడు లక్షల వరకూ అందుతూంటాయి. సలహాదారులు ప్రభుత్వానికి సలహాలు ఇవ్వడం, విధానపరమైన నిర్ణయాలలో లోటుపాట్లు ఉంటే సరిదిద్దడం వంటివి చేయాలి. కానీ ఒక్క సలహాదారుడు కూడా ఆ పని చేస్తున్నట్లుగా ఉండదు.
ఒకే ఒక్క సలహాదారు మాత్రం ఎప్పుడూ తెర వెనుక.. తెర ముందు కనిపిస్తూ ఉంటారు. మిగతా సలహాదారులకు కూడా ఆయన దిశానిర్దేశకుడు. ఆయనే రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారునిగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి. ప్రభుత్వ ముఖ్య సలహాదారునిగా ఉన్న అజయ్ కల్లాం కూడా ఓసారి మీడియాతో మాట్లాడి సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులపై జగన్ చేసిన ఫిర్యాదును మీడియా కు వివరించారు. అయితే ఆయన మీడియా ముందుకు రావాలన్నది కూడా.. సజ్జలే డిసైడ్ చేశారని.. సెక్రటేరియట్లో ఉండే అటెండర్కి కూడా తెలుసు.
మరికొందరు సలహాదారులు సజ్జల డైరక్షన్లో అనధికారిక మంత్రులుగా చెలామణి అవుతున్నారు. మరో సలహాదారు సోషల్ మీడియాను నడిపిస్తున్నారు. ప్రస్తుతం మరికొంతమంది సలహాదారులు కూడా తెర వెనుక ఉండి పార్టీని నడిపిస్తున్నారు. ఆయన తీరుపై ప్రభుత్వ వర్గాల్లోనూ అసంతృప్తి ఉంది. సూపర్ సీఎంగా చెలామణి అవుతున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఈ తరుణంలో సలహాదారుపై హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రభుత్వంలోనూ కలకలం రేపడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ప్రభుత్వం న్యాయవ్యవస్థను ఏ విషయంలోనూ పరిగణనలోకి తీసుకోలేదు. ఇప్పుడూ తీసుకోదని కొంత మంది చెబుతున్నారు.