ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పిల్లలను మానసిక క్షోభకు గురి చేస్తోంది. ఇదిగో పరీక్షలు.. అదిగో పరీక్షలు అంటూ ఎప్పటికప్పుడు కొత్త టెన్షన్లకు గురి చేస్తోంది. మానసికంగా ప్రశాంతంగా ఉండనీయడం లేదు. సీబీఎస్ఈ నుంచి తెలంగాణ సర్కార్ వరకూ అన్ని విద్యాబోర్డులు.. పరీక్షలను రద్దు చేసి.. మార్కులను.. గ్రేడ్లను.. జీపీఏలను ఇచ్చే ప్రక్రియ లో ఉన్నాయి. తదుపరి విద్యా సంవత్సరంపై దృష్టి పెట్టాయి. అయితే ఏపీ సర్కార్ మాత్రం.. పరీక్షలు నిర్వహిస్తామనే చెబుతోంది. రెండు రోజుల నుంచి పరీక్షల తేదీలతో సహా.. మీడియాకు లీక్ చేసిన ప్రభుత్వ వర్గాలు.. గురువారం ముఖ్యమంత్రి సమీక్ష తర్వాత నిర్ణయం ప్రకటిస్తామన్నారు.
చివరికి జనగ్మోహన్ రెడ్డికి చెందిన అధికారిక మీడియాలో కూడా.. ఈ అంశంపై వార్తలు వచ్చాయి. వచ్చే నెల ప్రారంభంలో ఇంటర్.. చివరిలో టెన్త్ పరీక్షలు పెడతారని.. సెప్టెంబర్ మొదటి వారంలో టెన్త్ రిజల్ట్స్ ఇస్తామని లీకులు ఇచ్చారు. దీంతో విద్యాశాఖపై సీఎం సమీక్ష తర్వాత అధికారిక ప్రకటన వస్తుందేమోనని ఎదురు చూసిన విద్యార్థులకు నిరాశ ఎదురయింది. సమీక్ష ముగిసిన తర్వాత మంత్రి సురేష్.. అసలు పరీక్షల గురించి ముఖ్యమంత్రితో చర్చించలేదని చెప్పుకొచ్చారు. దీంతో విద్యార్థులు హతాశులయ్యారు.
అసలు పరీక్షలు ఉంటాయా.. ఉండవా.. అనే టెన్షన్ ఓ వైపు.. పెడితే ఎప్పుడు పెడతారు.. ఎలా పెడతారు అనే ఆందోళన మరో వైపు.. వారిని ఇబ్బందికి గురి చేస్తోంది. పరీక్షలపై సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని ఇప్పటికీ సురేష్ కబుర్లు చెబుతున్నారు. పసివాళ్ల పట్ల.. పరీక్షల విషయంలో ఉండే వారి ఆందోళనల పట్ల కనీస పట్టింపు లేకుండా… వారిని తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్న ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అయితే ప్రభుత్వం ఇలాంటి వాటిని పట్టించుకునే పరిస్థితిలో లేదు.
మంత్రి సురేష్‌ను ఈ విషయంలో వ్యూహాత్మకంగా బ్యాడ్ చేస్తున్నారన్న అభిప్రాయం వైసీపీలో వినిపిస్తోంది. పరీక్షల విషయంలో అత్యుత్సాహంతో ఆయన ప్రకటనలు చేయడం.. వాటిని మళ్లీ ఆయనే కాదనడం.. పదే పదే జరుగుతోంది. దీంతో ఆయను కన్ఫ్యూజన్ మంత్రిగా విపక్షాలు విమర్శిస్తున్నాయి. పై నుంచి వచ్చే ఆదేశాల ప్రకారమే సురే్ష్ మాట్లాడుతారని.. సొంత ఆలోచనలు ఉండవని.. ఆయనను కావాలనే అలా చేస్తున్నారన్న చర్చలు వైసీపీలో జరుగుతున్నాయి.