కరోనా సంక్షోభంలో బాధితుల కోసం ఏదో ఓ సాయం చేయాల్సిన బీజేపీ నేతలు… ఇప్పుడూ మతం గురించి కలవరిస్తున్నారు. ప్రముఖ దేవాలాయాల్లో క్వారంటైన్ సెంటర్లను ఏర్పాటు చేయాలని..ప్రభుత్వం నిర్ణయించింది. ఆదాయం ఎక్కువగా ఉన్న ఆలయాల్లో… కనీసం ఆలయాల సిబ్బంది కోసమైనా… ప్రత్యేకంగా కోవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని అందరూ హర్షించారు. ఆపన్నులకు సాయం చేయడమే దైవత్వం. అయితే రాజకీయ పార్టీలు అన్నీ ఒకే అభిప్రాయంతో ఉండటం సాధ్యం కాదు. ముఖ్యంగా మత రాజకీయాలు చేసే పార్టీలకు అసలు సాధ్యం కాదు.
ఇలాంటి రాజకీయాల్లో బీజేపీ ముందు ఉంటుంది. అందుకే ఏపీ బీజేపీ నేతలు మిగతా అన్ని సమస్యలను వదిలేసి.. గుడికి సంబంధించిన ఆస్తుల్లో క్వారంటైన్ కేంద్రాలను పెట్టాలనే నిర్ణయాన్ని తప్పు పడుతూ … ట్వీట్లు.. ప్రకటనలు చేస్తున్నారు. క్వారంటైన్ సెంటర్లుగా హిందూ ఆలయాలను వాడుతున్నారు, చర్చిలు, మసీదులను ఎందుకు వాడుకోవడం లేదు, అన్ని మతాల్లోనూ కరోనా బాధితులున్నారని వాదిస్తున్నారు. అదే ఏపీ బీజేపీ విధానం అయినట్లుగా.. కింది స్థాయి నుంచి పై స్థాయి వరకూ అందరూ ఒకే తరహా ఆరోపణలు.. విమర్శలతో ట్వీట్లు ప్రకటనలు చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ ప్రకటనల్ని పెద్దగా ఎవరూ పట్టించుకోవడం లేదు.
కానీ.. సోషల్ మీడియాలో మాత్రం ట్రోలింగ్‌కు గురవుతున్నారు. కరోనా విషయంలో ప్రభుత్వాన్ని విమర్శించాలనుకుంటే.. సవాలక్ష… తప్పులు ఉన్నాయని.. వాటిపై దృష్టి పెట్టకుండా… క్వారంటైన్ సెంటర్ల ఏర్పాటుపై చేయడమేమిటని ప్రశ్నిస్తున్నారు. అయితే బీజేపీ నేతలు ఎప్పుడూ ఇలాంటి వాటిని పట్టించుకోరు. వారి రాజకీయం వారిది.